గంజాయి విక్రయం @ టీ కొట్టు
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:03 AM
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన యువకుడు టీ స్టాల్‌లో పనికి చేరాడు. ఈజీమనీకి అలవాటు పడి గంజాయి స్మగ్లర్‌గా మారాడు. పనిచేస్తున్న దుకాణ యజమానికి తెలియకుండా గంజాయి కొనుగోలు చేసి స్కూటీలో దాచి కస్టమర్లకు విక్రయిస్తున్నాడు.
బీదర్ నుంచి తెచ్చి.. స్కూటీలో దాచిపెట్టి విక్రయం
వివిధ కేసుల్లో ఐదుగురు గంజాయి విక్రేతలు అరెస్ట్
కిలో గంజాయి, 4 స్కూటీలు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన యువకుడు టీ స్టాల్‌లో పనికి చేరాడు. ఈజీమనీకి అలవాటు పడి గంజాయి స్మగ్లర్‌గా మారాడు. పనిచేస్తున్న దుకాణ యజమానికి తెలియకుండా గంజాయి కొనుగోలు చేసి స్కూటీలో దాచి కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారమందుకున్న ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం నిందితుడిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే...
నారాయణ్‌ఖేడ్(Narayankhed)కు చెందిన ఉద్యానాథ్, బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఉప్పల్‌లో ఓ టీ దుకాణంలో పనిచేస్తున్నాడు. గంజాయి దందాలో ఉన్న సంపాదనను గుర్తించిన ఇతడు తనకున్న పరిచయాలతో బీదర్ నుంచి గంజాయి తెప్పించి, స్కూటీలో దాచుతున్నాడు. టీ తాగేందుకు వచ్చిన కొంతమందితో పరిచయం పెంచుకొని వారికి గంజాయి విక్రయిస్తున్నాడు. చిన్న ప్యాకెట్ గంజాయి రూ.500 చొప్పున కస్టమర్లకు ఇస్తున్నాడు. ఇతడి దందాపై పక్కా సమాచారమందుకున్న రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ సిబ్బంది గంజాయి విక్రయిస్తుడంగా అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 730 గ్రాముల గంజాయి, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి దందా చేస్తున్న ఉద్యానాథ్ టీ దుకాణ యజమాని ఇచ్చే ఆదాయం కన్నా ఎన్నో రెట్ల ఆదాయం సంపాదిస్తున్నాడని, ఈ దందా మొత్తం దుకాణ యజమానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
మరో నలుగురు అరెస్ట్...
నగరంలో పలు ప్రాంతాల్లో దాడులు చేసిన ఎక్సైజ్ సిబ్బంది నలుగురు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేశారు. కాప్రాలోని నేతాజీనగర్‌లో గంజాయి విక్రయాలు చేస్తున్న మంద రాహుల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ సిబ్బంది అతడి వద్ద నుంచి 130 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాప్రా వంపుగూడ ప్రాంతంలో గంజాయి విక్రయాలు చేస్తున్న విశ్వనాథ్, మనోజ్, తనీష్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 234 గ్రాములు గంజాయి, 3 మొబైల్ ఫోన్లు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి వార్నింగ్
ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం
Read Latest Telangana News and National News