తల్లి ప్రోత్సాహంతోనే హత్యలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:38 AM
తల్లి ప్రోత్సాహంతోనే పిన్నమ్మ, ఆమె కుమారుడి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తరిమెల ఎస్సీ కాలనీలో జరిగిన జంట హత్యల కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ కౌలుట్లయ్య గురువారం తెలిపారు.
తరిమెల జంట హత్యల కేసులో ఐదుగురి అరెస్ట్
ఇల్లు, పొలం ఇవ్వలేదనే దారుణం
శింగనమల(అనంతపురం): తల్లి ప్రోత్సాహంతోనే పిన్నమ్మ, ఆమె కుమారుడి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తరిమెల ఎస్సీ కాలనీలో జరిగిన జంట హత్యల కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ కౌలుట్లయ్య గురువారం తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. మండలంలోని తరిమెల గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీకి చెందిన దండోరా నల్లప్పకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య డండోరా లక్ష్మిదేవికి డండోరా జగ్జీవన్‌రామ్(అలియాస్ మోహన్), దండోరా ఓంకార్ (అలియాస్ పిట్టి) కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో భార్య దండోరా యల్లమ్మకు దండోరా సాయికుమార్, దండోరా అంబేడ్కర్(అలియాస్ చిన్న)అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
సాయికుమార్ ఐదేళ్ల కిందట మృతి చెందాడు. దండోరా నల్లప్ప కూడా మూడేళ్ల కిందట మృతి చెందాడు. నల్లప్పకు చెందిన పొలం, ఇంటిని రెండో భార్య దండోరా యల్లమ్మ రాయించుకుందని, పెద్ద భార్య దండోరా లక్ష్మిదేవి, ఆమె కుమారులు గొడవ పడేవారు. దీనిపై పలుమార్లు పంచాయితీలు జరిగినా వివాదం పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో తరిమెలలో అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తున్న యల్లమ్మను, ఆమె కుమారుడు అంబేడ్కర్‌ను చంపితేనే ఇల్లు, పొలం దక్కుతాయని పెద్దభార్య లక్ష్మిదేవి తన కుమారులను రెచ్చగొట్టింది. ఈక్రమంలో ఈనెల 2న రాత్రి పెద్ద భార్య లక్ష్మీదేవి, ఆమె ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కలిసి యల్లమ్మ ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగారు. ఈక్రమంలోనే పాశవికంగా యల్లమ్మను వేటకొడవళ్లతో నరికి చంపారు. పారిపోతున్న తమ్ముడు అంబేడ్కర్‌ను సైతం రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పథకం ప్రకారమే...
యల్లమ్మను, ఆమె కుమారుడు అంబేడ్కర్‌ను చంపితేనే ఇల్లు, పొలం దక్కుతాయని తల్లి లక్ష్మీదేవి తరచూ కుమారులకు నూరిపోసేది. దీంతో వారు హత్యకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. పెద్ద భార్య లక్ష్మిదేవి పెద్ద కుమారుడు జగ్జీవన్‌రామ్ లారీ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఇతడికి ఇల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులతో పరిచయం ఉంది. వీరిద్దరిపై కర్ణాటక(Karnataka)లోని చిక్కబళ్లాపురంలో ద్విచక్రవాహనం చోరీ కేసు ఉంది. కాగా ఈనెల 2న మా ఇంటి దేవుడు తొండపాడు రంగనాథస్వామి తిరునాళ్ల ఉందని శ్రీనివాసులను జగ్జీవన్‌రామ్ తమ్ముడు ఓంకార్ ఇంటికి ఆహ్వానించాడు.
దీంతో శ్రీనివాసులు తన బంధువైన పెద్దవడూగూరు మండలం వీరేపల్లికి చెందిన బోయ కిరణ్‌కుమార్‌తో కలిసి వచ్చాడు. నలుగురు కలిసి 2న సాయంత్రం 4 గంటల వరకు తొండపాడులో మద్యం సేవించారు. ఈ సందర్భంగా హత్యకు ప్రణాళిక రూపొందించారు. పామిడికి వెళ్లి ఒక వర్క్ షాపు వద్ద రెండు వేట కొడవళ్లు చేయించారు. తర్వాత కర్ణాటక రిజిస్ర్టేషన్ కలిగిన కారులో రాత్రి 10.30 తరువాత యల్లమ్మ ఇంటి వద్దకు నలుగురు వెళ్లి గొడవకు దిగారు. ఈక్రమంలోనే తల్లి, కొడుకులను కిరాతకంగా హత్య చేశారు.
ఐదుగురి అరెస్టు
ఈ హత్య కేసులో దండోరా లక్ష్మిదేవి, దండోరా జగ్జీవన్‌రామ్, దండోరా ఓంకార్, శ్రీనివాసులు, కిరణ్‌కుమార్‌ను గురువారం అరెస్టు చేసి రిమండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. నిందితులు కల్లూరు ప్రాంతంలో ఉన్నారన్న సమాచారంతో గార్లదిన్నె, శింగనమల, నార్పల పోలీసులు అక్కడికి వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కుప్పంలో ప్రపంచ స్థాయి న్యూట్రిషన్ ప్లాంట్
మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
Read Latest Telangana News and National News