Chinese manja: రూ.1.24 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం
ABN , Publish Date - Jan 09 , 2026 | 07:17 AM
రాజధాని నగరం హైదరాబాద్‌లో పెద్దఎత్తున చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.24 కోట్లు ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. కాగా.. ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజాపై నిషేధించి పది సంవత్సరాలు అవుతోంది.
- నిషేధించి పదేళ్లు గడుస్తున్నా విక్రయాలు ఆగట్లే
- చైనా మాంజా వాడినా కేసులే: సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ: నిషేధించిన చైనా మాంజా(Chinese manja) వినియోగించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరుస దాడుల్లో రూ.1.24 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సింథటిక్, నైలాన్ కలిపి తయారు చేసే చైనా మాంజా వినియోగం వల్ల మనుషులు, పక్షుల ప్రాణాలకు ప్రమాదం కలగడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు.
ఐసీసీసీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ నిందితులను విచారించగా ఈ చైనా మాంజా గుజరాత్, ఢిల్లీ, సూరత్‌ల నుంచి నగరానికి వస్తుందని తెలిసిందన్నారు. రైలు, రోడ్డు మార్గాల్లో కొరియర్ సంస్థల ద్వారా నగరానికి చైనా మాంజా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. చైనా మాంజా రవాణాపై ట్రావెల్ ఏజెన్సీలు, కొరియర్ సంస్థలకు లేఖలు రాశామని తెలిపారు. నిందితులకు గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ. లక్ష వరకు జరిమానా ఉంటుందన్నారు.

లేబుళ్లు మార్చి..
పోలీసుల దాడులతో భయపడిన విక్రేతలు రూటు మార్చి వాణిజ్య అవసరాల కోసమని లేబుళ్లు మార్చి విక్రయిస్తున్నారని సీపీ తెలిపారు. మరి కొందరు నిల్వ చేసిన చైనా మాంజాను ఆన్‌లైన్ వేదికల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. సంక్రాంతి తర్వాత కూడా చైనా మాంజా కేసులపై దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నట్లు గమనించినా డయల్ 100 లేదా 94906165558కి సమాచారమందించాలని సీపీ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్
శాప్‌కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు
Read Latest Telangana News and National News