యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా డబ్బులు కట్ అయ్యాయా? ఇలా చేయండి
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:05 AM
యూపీఐలో పేమెంట్ చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా..? అయినా డబ్బులు కట్ అయ్యాయా..? ఏం చేయాలో తెలుసుకుందాం రండి.
ఇంటర్నెట్ డెస్క్: కొన్నిసార్లు యూపీఐలో పేమెంట్స్ చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా బ్యాంక్ ఖాతాలో డబ్బులు కట్ అవుతాయి. ఇది చూసి చాలా మంది కంగారు పడుతుంటారు. టెక్ నిపుణులు మాత్రం ఇదేమీ పెద్ద సమస్య కాదని, దానికి ఆందోళన అసలే అవసరం లేదని చెబుతున్నారు. విఫలమైన లావాదేవీలో కట్ అయిన డబ్బులు నిర్దిష్ట కాలపరిమితి లోపు తిరిగి ఖాతాకు బదిలీ అవుతాయని వివరిస్తున్నారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సొమ్ము వెనక్కు రాదు. అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.
మొదటి ట్రాన్సాక్షన్ విఫలం కాగానే చాలామంది రెండోసారి పేమెంట్ చేయడానికి సిద్ధమవుతారు. అది తప్పు. ఇలాంటి సమయంలో ముందు మొదటి లావాదేవీ నిజంగా ఫెయిల్ అయిందా.. లేదా? అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి. దాని లేటెస్ట్ స్టేటస్‌ను గమనించాలి. ఇందుకోసం యూపీఐ యాప్‌లో లావాదేవీ ఐడీ, స్థితి, మిగతా వివరాలు చూడండి. ఆ తరువాత బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ నుంచి వచ్చిన ఎస్ఎమ్ఎస్ చెక్ చేయండి.
డబ్బులు తిరిగి ఎప్పుడు వస్తాయి..?
సాధారణంగా కట్ అయిన నగదు తిరిగి ఖాతాలో క్రెడిట్ అవ్వడానికి 1 నుంచి 5 రోజుల (బిజినెస్ డేస్) సమయం పడుతుంది. ఒకవేళ నిర్ణీత కాలం దాటినా డబ్బు వాపసు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూపీఐ సహాయ వ్యవస్థకు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం ట్రాన్సాక్షన్ ఐడీ, డేట్ తదితర వివరాలు కావాలి. ఫిర్యాదు చేసినా నగదు రాకపోతే వెంటనే బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు పరిశీలించిన బ్యాంక్ పరిష్కారం చూపిస్తుంది.
ఈ వార్తలూ చదవండి