యూపీఐపై ‘మోదీ పన్ను’
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:51 AM
వాణిజ్య యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలను ‘మోదీ పన్ను’గా కాంగ్రెస్ అభివర్ణించింది. ఎండీఆర్ చార్జీలతో పడే భారాన్ని వ్యాపారులు వినియోగదారుల నుంచే వసూలు చేస్తారన్న విషయం ప్రభుత్వానికి తెలియదా అని నిలదీసింది.
అమెరికా ఒత్తిడికి ప్రధాని తలవంచారు: రాహుల్
కాంగ్రెస్‌ది అబద్ధాల దుకాణం: బీజేపీ
వాణిజ్య యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలను ‘మోదీ పన్ను’గా కాంగ్రెస్ అభివర్ణించింది. ఎండీఆర్ చార్జీలతో పడే భారాన్ని వ్యాపారులు వినియోగదారుల నుంచే వసూలు చేస్తారన్న విషయం ప్రభుత్వానికి తెలియదా అని నిలదీసింది. ప్రధాని మోదీ అమెరికా ఒత్తిడికి తలొగ్గి యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘రూ.2 వేలకు మించిన వాణిజ్య లావాదేవీలు 5శాతమే ఉంటాయని, వాటిపైనే ఎండీఆర్ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో 65ు ఇవే ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. భారత జీరో ఎండీఆర్ చార్జీల విధానాన్ని అమెరికా చెల్లింపుల సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా ఒత్తిళ్లకు ప్రధాని మోదీ మరోసారి తలొగ్గారు’’ అని విమర్శించారు. ఇక మోదీ ప్రభుత్వ దోపిడీ ఇప్పుడు యూపీఐ వరకు చేరిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కోసమంటూ మోదీ యూపీఐని తీసుకువచ్చారని, ఇప్పుడా యూపీఐని వినియోగిస్తున్నందుకు చార్జీలు వేస్తున్నారని.. ఇది ‘మోదీ పన్ను’ అని సీనియర్ నేత పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. మరోవైపు, ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ అబద్ధాల దుకాణం తెరిచిందని, డిజిటల్ ఇండియాను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
11 దేశాల్లో యూపీఐ
2016 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం యూపీఐ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఖతార్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, శ్రీలంక, కాంబోడియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్.. మొత్తం 11 దేశాలు యూపీఐ చెల్లింపులను అనుమతిస్తుండటం గమనార్హం. 2016-17లో కేవలం రూ.7 వేల కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా.. 2025-26లో ఏకంగా రూ.314 లక్షల కోట్ల విలువైన యూపీఐ చెల్లింపులు జరగడం గమనార్హం.