Share News

యూపీఐ చార్జీలపై జీఎస్టీ!

ABN , Publish Date - Sep 17 , 2026 | 06:18 AM

యూపీఐ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణ భారం నుంచి బ్యాంకులు, చెల్లింపుల గేట్‌వేలు, సంబంధిత సంస్థలకు ఉపశమనం కలిగించేందుకే...

యూపీఐ చార్జీలపై జీఎస్టీ!

  • పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వానికి భారీగా రాబడి

  • 25-26లో రూ.2వేలపైన వాణిజ్య యూపీఐ లావాదేవీలు రూ.60 లక్షల కోట్లు

  • వాటిపై 24 వేల కోట్ల ఎండీఆర్‌ చార్జీలు

  • జీఎస్టీ రూపేణా సర్కార్‌కు 4వేల కోట్లకుపైగా

  • ట్రంప్‌ ముందు మోదీ మోకరిల్లారు

  • యూపీఐపై పన్నువేసి అమెరికాకు సొమ్ము అందిస్తున్నారు: రాహుల్‌ గాంధీ

  • చార్జీలపై వెనక్కి తగ్గేదే లేదు: కేంద్రం

  • పండుగ సీజన్‌లో డిజిటల్‌ చెల్లింపులకు దెబ్బ

  • చార్జీల భారాన్ని వ్యాపారులు వినియోగదారులపైనే వేసే అవకాశం

  • పెట్రోలు బంకులను మినహాయించాలి

  • యునైటెడ్‌ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: యూపీఐ చెల్లింపుల వ్యవస్థ నిర్వహణ భారం నుంచి బ్యాంకులు, చెల్లింపుల గేట్‌వేలు, సంబంధిత సంస్థలకు ఉపశమనం కలిగించేందుకే ఎండీఆర్‌ (వ్యాపారుల నుంచి వసూలు చేసే చార్జీ)ను విధించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే యూపీఐ ఎండీఆర్‌ చార్జీలపై జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులు సహా సేవారంగంలోని అన్నిరకాల సంస్థల సేవలపై ప్రస్తుతం 18శాతం జీఎస్టీ అమల్లో ఉంది. ఆ లెక్కన యూపీఐ ఎండీఆర్‌ చార్జీలపైనా ఈ జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రూ.2 వేలు దాటిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై 0.4 శాతం (గరిష్ఠంగా రూ.300) ఎండీఆర్‌ చార్జీలను విధిస్తున్నట్టు ఎన్‌పీసీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానున్న ఈ చార్జీల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వానికి ఆదాయం ఎంత?

ఎన్‌పీసీఐ, బెంగళూరు ఐఐఎం వివరాల ప్రకారం 2025-26లో మొత్తం యూపీఐ చెల్లింపుల విలువ రూ.314 లక్షల కోట్లు. అందులో వ్యాపారులకు చేసిన చెల్లింపులు 29ు.. అంటే సుమారు రూ.91 లక్షల కోట్లు. ఇందులో రూ.2వేలకు పైబడిన వాణిజ్య యూపీఐ చెల్లింపులు 66ు.. అంటే సుమారు రూ.60 లక్షల కోట్లు. ఈ సొమ్ముపై ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన 0.4ు ఎండీఆర్‌ అంటే.. చార్జీల రూపంలో వసూలయ్యే సొమ్ము సుమారు రూ.24 వేల కోట్లు. ఇందులో జీఎస్టీ 18శాతం అంటే సుమారు రూ.4,300 కోట్లు ప్రభుత్వానికి వెళుతుంది. అయితే ఇవన్నీ చూచాయగా వేసిన అంచనాలేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎండీఆర్‌ చార్జీలపై రూ.300 గరిష్ఠ పరిమితి, ఇంధన, బీమా, విద్యుత్‌, టెలికం తదితర చెల్లింపులపై ఒక్కో లావాదేవీకి కేవలం రూ.5 చార్జీ, స్టాక్‌ బ్రోకర్లు, మ్యూచువల్‌ ఫండ్లకు చెల్లింపులపై 0.02శాతం అతితక్కువ చార్జీ, నెలవారీ రూ.లక్షలోపు చెల్లింపులు ఉండే వ్యాపారులకు ఎండీఆర్‌ మినహాయింపు వంటివాటితో.. మొత్తంగా ఎండీఆర్‌తో పడే భారం తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.


వెనక్కి తగ్గేదే లేదు: కేంద్రం

వాణిజ్య యూపీఐ లావాదేవీలపై చార్జీలపై వస్తున్న విమర్శలు, చార్జీలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఎండీఆర్‌ చార్జీలపై పునరాలోచన ఏదీ లేదని కేంద్ర ఆర్థికశాఖ బుధవారం స్పష్టం చేసింది. యూపీఐ వ్యవస్థ సుస్థిరత, భద్రత కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, అక్టోబరు 15 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఎండీఆర్‌ చార్జీలు కేవలం వ్యాపారులు చెల్లించేవి మాత్రమేనని, వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని, రూ.2 వేలలోపు వాణిజ్య లావాదేవీలు, వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు పూర్తి ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొంది. చార్జీల విధింపుపై విదేశాల ఒత్తిళ్లు ఉన్నాయన్నది అవాస్తవమని స్పష్టం చేసింది.

మోదీ కాస్త నిటారుగా నిలబడాలి: రాహుల్‌

ప్రధాని మోదీ అమెరికా పేమెంట్‌ సంస్థల ఒత్తిడికి తలొగ్గి యూపీఐపై చార్జీలు విధించారని, ట్రంప్‌ ఒత్తిళ్లకు మోదీ లొంగిపోయారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి ఆరోపించారు. ఎండీఆర్‌ చార్జీలను యూపీఐ ట్యాక్స్‌గా అభివర్ణించారు. యూపీఐపై పన్ను విధిస్తూ అమెరికాకు భారీ మొత్తంలో డబ్బు అందిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఒకప్పుడు ఇందిరాగాంధీని మీరు లెఫ్ట్‌ (వామపక్షాలు), రైట్‌ (తీవ్ర జాతీయ వాదం)లలో ఎటువైపు మొగ్గుతారు అని కొందరు ప్రశ్నించారు. తాను ఎడమవైపు, కుడివైపు ఎటూ మొగ్గుచూపను. నిటారుగా నిలబడతానని ఇందిరాగాంధీ సమాధానం ఇచ్చారు. కానీ మోదీ పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎడమ వైపు, కుడివైపు కాకుండా పూర్తిగా ట్రంప్‌ ముందు తలవంచారు. మోదీ అమెరికా ముందు తలవంచడం ఆపాలి. వెన్నెముకపై నిటారుగా నిలబడాలి. యూపీఐ ట్యాక్స్‌ను వెనక్కి తీసుకోవాలి..’’ అని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. అమెరికా క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల కంపెనీలకు పోటీ అవకాశం ఇవ్వడానికే యూపీఐపై చార్జీలు విధించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ ఆరోపించారు.

ఎండీఆర్‌ చార్జీలపై సుప్రీంలో పిటిషన్‌

రూ.2వేలకు మించిన వాణిజ్య యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ చార్జీల విధింపును సవాల్‌ చేస్తూ బుధవారం సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. తగిన చట్టపరమైన రక్షణలు, ప్రజలతో సంప్రదింపులు లేకుండానే ఈ రుసుమును ప్రవేశపెట్టారని అంజన్‌ దత్తా అనే న్యాయవాది ఈ పిల్‌ను దాఖలు చేశారు. జాతీయ చెల్లింపుల చట్టం-2007లోని సెక్షన్‌ 10ఏను సవరించడంలో రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించారు.


మళ్లీ నగదు చెల్లింపుల వైపు వ్యాపారాలు

పండుగల సీజన్‌ సమయంలో యూపీఐపై చార్జీలతో డిజిటల్‌ చెల్లింపుల వినియోగంపై దెబ్బపడుతుందని రీటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. తక్కువ మార్జిన్లతో పనిచేసే మధ్యతరహా రిటైలర్లు, హోల్‌సేలర్లు మళ్లీ నగదు చెల్లింపుల వైపు మళ్లే అవకాశం ఉందని పేర్కొంది. యూపీఐ లావాదేవీలు పారదర్శకంగా ఉండి, వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నందున.. యూపీఐ ఎండీఆర్‌ భారాన్ని కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వు బ్యాంకు భరించాలని విజ్ఞప్తి చేసింది. ఇక ఎండీఆర్‌ చార్జీల రూపంలోని అదనపు భారాన్ని తప్పించుకునేందుకు నగదు చెల్లింపులను ప్రోత్సహిస్తామని ఢిల్లీలోని పలు వ్యాపార సంఘాలు ప్రకటించాయి. ఒకవేళ డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించినా.. ధరల పెంపు, ఇతర మార్గాల ద్వారా వినియోగదారుల నుంచే చార్జీలను వసూలు చేసుకునే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నాయి.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 06:18 AM