బడ్జెట్ 2026: ఆదివారం రోజే ఎందుకు? ఆ రోజు స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటి.?
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:17 PM
ప్రస్తుతం సగటు భారతీయుని ధ్యాసంతా రానున్న ఆదివారం మీదే ఉంది. ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ.. యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవడమే ఇందుకు కారణం. మరి ఆ రోజే ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.. స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటో ఓసారి చూస్తే...
ఇంటర్నెట్ డెస్క్: దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారు కావడంతో.. ఇప్పుడు అందరి దృష్టీ ఫిబ్రవరి 1(ఆదివారం) మీదే ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman).. ఆ రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే దీనికి ప్రధాన కారణం. ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టాలనే నిబంధనను పాటిస్తుండటంతో ఈ ఆదివారానికి ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఆదివారం రోజే ఎందుకు యానియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాని వెనకున్న కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
ముఖ్య కారణాలివే..
నిర్ణీత తేదీ పాటించడం: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించాలనే ప్రభుత్వ నిబంధనను ఆ రోజు ఆదివారం అయినప్పటికీ పాటించడం ద్వారా క్రమశిక్షణను ప్రదర్శించడం(Feb 1 Rule).
ఆర్థిక సంవత్సర సన్నద్ధత: ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే బడ్జెట్ అంచనాలు, నిధుల కేటాయింపులు, ఇతర ఆర్థిక విధానాలను ఆమోదించడానికి ఇది దోహదం కానుంది(Fiscal Year Preparation).
లోతైన విశ్లేషణ: సాధారణ పని దినాల్లో ఉండే సందడి(Weekday Distractions) ఆదివారం ఉండదు. కాబట్టి బడ్జెట్ అంశాలపై మరింత లోతుగా చర్చలు, విశ్లేషణలు జరిగేందుకు అవకాశం ఉంటుంది.
పాత పద్ధతికి స్వస్తి: పూర్వం ఫిబ్రవరి చివరి పని దినంలో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. దీంతో ఇది సకాలంలో ఆమోదం పొందడానికి కష్టతరమయ్యేది. అందువల్ల ఫిబ్రవరి 1కి మార్చారు. ఈసారీ అదే పద్ధతిని పాటించనున్నారు.
స్టాక్ మార్కెట్ల పరిస్థితి..
ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం అయినప్పటికీ యూనియన్ బడ్జెట్(Union Budget) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు యథాతథంగా పని చేస్తాయి. ఈ మేరకు రెండు ఎక్స్ఛేంజీలు ఇన్వెస్టర్ల సమాచారం కోసం ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశాయి. ఆ రోజు ప్రీ ఓపెన్ మార్కెట్ ఉదయం 9:00 గంటలకు ప్రారంభమై 9:08కి ముగియనుంది. ఆ తర్వాత సాధారణ మార్కెట్ వేళలు 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఉంటాయని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. బీఎస్ఈ కూడా అదే తరహాలో సర్క్యులర్ జారీ చేస్తూ సాధారణ వేళల్లానే మార్కెట్ పని చేస్తుందని వెల్లడించింది.
ఇవీ చదవండి:
బడ్జెట్2026.. కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?
దంపతులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో ట్యాక్స్ ఫైలింగ్‌పై కీలక ప్రకటన..?