Share News

కేంద్ర బడ్జెట్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఇవే.!

ABN , Publish Date - Jan 31 , 2026 | 10:51 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న(ఆదివారం) కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదితో ఆమె వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్‌పై ప్రసంగించనున్నారు.

 కేంద్ర బడ్జెట్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఇవే.!
Union Budget 2026

Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న(ఆదివారం) కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదితో ఆమె వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్‌పై ప్రసంగించనున్నారు. ఇది భారతదేశ పార్లమెంటరీ, ఆర్థిక చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధిక బడ్జెట్లను(10) ప్రవేశపెట్టిన రికార్డును కలిగి ఉన్నారు. అయితే ఆయన వరుసగా కాకుండా.. వేరు వేరు ప్రధానుల హయాంలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత బడ్జెట్‌ 2026 ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

హల్వా వేడుక:

ఈ వేడుక ఒక ఆచారం. హల్వా వేడుకతో బడ్జెట్ లాక్-ఇన్​పీరియడ్ (Lock-in period) ప్రారంభం అవుతుంది. అంటే బడ్జెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌లో వార్షిక పద్దు (Budget 2026-27)ను ప్రవేశపెట్టే వరకు ఆ నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. వారు బయటకు వెళ్లడానికి వీలుండదు. వారు ఎల్లప్పుడూ సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటారు. కనీసం వారు ఫోన్ చేయడానికి కూడా వీలుండదు. నార్త్ బ్లాక్ లో 1980 నుంచి 2020 వరకు 40 సంవత్సరాలు బడ్జెట్ పత్రాలను ముద్రించడానికి సంప్రదాయకంగా ఉపయోగించిన ప్రింటింగ్ ప్రెస్ ఉంది.

యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్:

వార్షిక ఆర్థిక నివేదిక, డిమాండ్ ఫర్ గ్రాంట్స్(DG), ఫైనాన్స్ బిల్లు మొదలైన వాటితో సహా అన్ని కేంద్ర బడ్జెట్ పత్రాలు 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్'లో అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా పార్లమెంట్ సభ్యులు, సాధారణ ప్రజలు డిజిటల్‌గా అందుబాటులో ఉండే రీతిలో బడ్జెట్ పత్రాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.


చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్:

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాదితో వరుసగా తొమ్మిదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ వివిధ కాలాల్లో సమర్పించిన 10 బడ్జెట్‌ల రికార్డుకు సీతారామన్ దగ్గరలో ఉన్నారు. 1959-64లో ఆర్థిక మంత్రిగా దేశాయ్ మొత్తం 6 బడ్జెట్‌లను, 1967-69 మధ్య 4 బడ్జెట్‌లను సమర్పించారు. మాజీ ఆర్థిక మంత్రులు పి.చిదంబరం తొమ్మిది, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్‌లను సమర్పించారు. వీరిద్దరూ వేరు వేరు ప్రధానుల హయాంలలో ఈ బడ్జెట్లను ప్రవేశ పెట్టారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో వరుసగా 9 బడ్జెట్‌లను ప్రవేశపెట్టి.. ఒకే ప్రధాని హయాంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు.

మొదటి బడ్జెట్:

స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న.. నాటి తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కే.షణ్ముఖం చెట్టి సమర్పించారు.


అత్యధిక బడ్జెట్లు:

మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధిక బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డును కలిగి ఉన్నారు. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో, తరువాత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో.. ఇలా ఆయన మొత్తం 10 బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. ఆయన తన మొదటి బడ్జెట్‌ను 1959 ఫిబ్రవరి 28న సమర్పించారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలలో పూర్తి బడ్జెట్‌లను సమర్పించారు. ఆ తర్వాత 1962లో తాత్కాలిక బడ్జెట్‌ను సమర్పించారు. 1967లో మరో తాత్కాలిక బడ్జెట్‌ను, ఆ తర్వాత 1967, 1968, 1969లలో మూడు పూర్తిస్థాయి బడ్జెట్‌లను సమర్పించారు.

రెండవ అత్యధిక బడ్జెట్లు:

మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి హెచ్‌డీ.దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ఆయన తొలిసారిగా 1996 మార్చి 19న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరుసటి ఏడాది అదే ప్రభుత్వం కింద ఆయన మరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అలానే 2004లో ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ఆర్థిక మంత్రిగా బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. 2004 నుంచి 2008 మధ్య 5 బడ్జెట్‌లను సమర్పించారు. కేంద్ర హోంమంత్రిగా కొంతకాలం పనిచేసిన తర్వాత ఆయన తిరిగి ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి వచ్చి 2013 నుంచి 2014లో బడ్జెట్‌లను సమర్పించారు.

మూడో అత్యధిక బడ్జెట్లు:

ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా తన పదవీకాలంలో ఎనిమిది బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ఆయన 1982, 1983, 1984లలో, 2009, 2012 మధ్య వరుసగా ఐదు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.


మన్మోహన్ సింగ్:

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1991, 1995 మధ్య పివి.నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.

అతి పొడవైన బడ్జెట్ ప్రసంగం:

2020 ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రజెంటేషన్ 2 గంటల 42 నిమిషాల పాటు చేసి అత్యంత పొడవైన బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును నెలకొల్పారు. ఆ సమయంలో ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగానే తన ప్రసంగాన్ని ముగించారు.

అతి చిన్న బడ్జెట్ ప్రసంగం:

1977లో హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ చేసిన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం ఇప్పటివరకు అతి చిన్నదిగా ఉంది. ఇందులో 800 పదాలు మాత్రమే ఉంటాయి.


బడ్జెట్ సమయం:

గతంలో.. సంప్రదాయకంగా ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. ఇంగ్లాండ్, భారత్ లలో ఒకేసారి ప్రకటనలు చేయగలిగే వలసరాజ్యాల యుగం నాటి సంప్రదాయంగా ఈ సమయం ఉంది. అయితే భారతదేశం లండన్ సమయం కంటే 4 గంటల 30 నిమిషాలు ముందుంది. కాబట్టి ఇండియాలో సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించడం వల్ల యూకేలో మరుసటి రోజు ఉదయం పూట జరుగుతుంది. అయితే 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. తొలిసారి సమయాన్ని మార్చారు. అప్పటి నుంచి బడ్జెట్‌లను ఉదయం 11 గంటలకు ప్రవేశపెడుతున్నారు.

బడ్జెట్ తేదీ మార్పు:

ఒకప్పుడు బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి రోజున ప్రవేశపెట్టేవారు. ఇది బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే 2017లో మోదీ ప్రభుత్వం ఈ పాత సంప్రదాయాన్ని మార్చేసింది. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. మన దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న మొదలవుతుంది. ఫిబ్రవరి చివరలో బడ్జెట్ ప్రవేశపెడితే, దానిపై చర్చలు ముగిసిన.. నిధులు విడుదలయ్యే సరికి మే లేదా జూన్ నెల వచ్చేది. దీనివల్ల కొత్త పథకాలు ప్రారంభం కావడానికి ఆలస్యమయ్యేది. అందువల్ల ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెడితే.. ఏప్రిల్ 1 నాటికి అన్ని పక్రియలు పూర్తవుతాయి. 2017 నుంచి ఈ కారణంతోనే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.


ఇవీ చదవండి:

అంతకంతకూ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! రోజుకో కొత్త రికార్డు..

మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్‌

Updated Date - Jan 31 , 2026 | 12:33 PM