ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్! జీడీపీ వృద్ధి రేటు 7.2%
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:54 PM
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఎకనమిక్ సర్వే-2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2026-27లో భారత జీడీపీ 6.8 నుంచి 7.2 శాతం మేర వృద్ధి సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశ ఆర్థిక గమనానికి దిక్సూచిగా నిలిచే ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ సాధించిన అభివృద్ధి, ఎదురైన సవాళ్లు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు తదితర కీలక విషయాలను ఆర్థిక సర్వేలో ప్రస్తావిస్తారన్న విషయం తెలిసిందే(Economic Survey 2026).
ఆర్థిక సర్వే హైలైట్స్..
2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ రియల్ జీడీపీ 6.8 శాతం నుంచి 7.2 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఆర్థిక సర్వే తేల్చింది. సుస్థిర దేశీయ డిమాండ్, స్థూల ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉండటంతో భారత ఆర్థిక ప్రగతికి ఢోకా లేదని ఆర్థిక సర్వే తేల్చింది. ఈ సర్వే ప్రకారం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. ప్రతికూల అంశాల ప్రాబల్యం కొనసాగుతోంది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక ప్రగతి ఓ మోస్తరు స్థాయిలోనే కొనసాగుతుంది. స్థూలంగా చూస్తే వస్తువుల ధరలు ఈ ఏడాదిలో స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది.
కృత్రిమ మేధతో ఆశించిన మేర ఆర్థిక ఫలాలు అందకపోతే ఆస్తుల విలువ తరిగి ఆర్థికరంగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. భౌగోళిక అనిశ్చితుల కారణంగా పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదించవచ్చు. ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉన్నా రాబోయే రోజుల్లో ప్రతికూలతలు పెరిగి పరిస్థితి వికటించే అవకాశం ఉందని కూడా ఆర్థిక సర్వే అంచనా వేసింది.
అమెరికా సుంకాల భారం ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని ఆర్థిక సర్వే తేల్చింది. సుంకాల విధింపు తరువాత జీడీపీ వృద్ధి అంచనాలు తగ్గినా వాస్తవంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చేపట్టిన వ్యవస్థాగత మార్పులు, విధానపరమైన నిర్ణయాల కారణంగా సుంకాల భారాన్ని భారత్ తట్టుకోగలిగిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.
ఇవీ చదవండి:
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం.. ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమన్న ప్రధాని
అజిత్ పవార్ విమాన ప్రమాదం! లేడీ పైలట్ చివరి మెసేజ్ చూసి బామ్మ కన్నీరుమున్నీరు