Share News

అజిత్ పవార్ విమాన ప్రమాదం! లేడీ పైలట్ చివరి మెసేజ్ చూసి బామ్మ కన్నీరుమున్నీరు

ABN , Publish Date - Jan 29 , 2026 | 09:16 AM

అజిత్ పవార్ విమానంలో కోపైలట్‌గా శాంభవి పాఠక్ తన బామ్మకు పంపిన చివరి మేసేజ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అది తన మనవరాలి చివరి మేసేజ్ అవుతుందని తాను అనుకోలేదంటూ వృద్ధురాలు కన్నీరుమున్నీరయ్యారు.

అజిత్ పవార్ విమాన ప్రమాదం! లేడీ పైలట్ చివరి మెసేజ్ చూసి బామ్మ కన్నీరుమున్నీరు
Shambhavi Pathak pilot death

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు పైలట్‌లు కూడా కన్నుమూశారు. అయితే, ప్రయాణానికి ముందు లేడీ పైలట్ శాంభవి పాఠక్ (ఫస్ట్ ఆఫీసర్) పంపిన మెసేజీ చూసి ఆమె బామ్మ మీరా పాఠక్‌ కన్నీరుమున్నీరు అయ్యారు. అదే తన చివరి మెసేజీ అవుతుందని అప్పుడు తాను అస్సలు అనుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు (Sambhavi Pathak's Last Message to Grandmother).

బారామతి ఎయిర్‌పోర్టుకు సమీపంలో బుధవారం ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు కన్నుమూశారు. మృతుల్లో ప్రధాన పైలట్‌‌తో పాటు ఫస్ట్ ఆఫీసర్ శాంభవి కూడా ఉన్నారు.

అయితే, విమానం బయలుదేరడానికి ముందు శాంభవి తన బామ్మ మీరా పాఠక్‌కు మెసేజ్ చేశారు. ఆమెకు గుడ్ మార్నింగ్ చెప్పారు. దీనికి స్పందించిన మీరా.. ఆమెకు గుడ్ మార్నింగ్ చిన్నీ అంటూ రిప్లై ఇచ్చారు. కానీ అది మనవరాలికి పంపే చివరి సందేశమని ఆమె అస్సలు ఊహించలేదు.

మీరా పాఠక్ గ్వాలియర్‌ నగరంలోని బసంత్ విహార్ ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నారు. ఆమె కుటుంబం ఢిల్లీకి మకాం మార్చినా ఎంతో కాలంగా తాను ఉంటున్న ఇంటిని మీరా వదిలిపెట్టలేకపోయారు. తన పిల్లలు, మనవరాళ్ల గుర్తులతో నిండిని ఇంటిని వదిలిపెట్టేందుకు ఆమెకు మనస్సు రాలేదు.


sambhavi Pathak 2.jpg

మనవరాలు మెసేజ్ పంపిన రెండు నిమిషాలకు మీరా రిప్లై ఇచ్చారు. ఆ తరువాత కొన్ని గంటలకు శాంభవి మరణవార్త వినేసరికి ఆమె తట్టుకోలేకపోయారు. శాంభవికి చివరి మెసేజ్ పంపిస్తున్నానని తాను అస్సలు ఊహించలేదని ఆమె విలపించారు. ‘విమానం కూలిపోయిందని నా పెద్ద కొడుకు ఫోన్ చేసి చెబితే నమ్మలేకపోయా. గత రాత్రే నేను అతడికి ఫోన్ చేశా. చీనీ (శాంభవి) ఎలా ఉందని అడిగా. శాంభవి ముంబైలో ఉంటోంది. నిత్యం బిజీగా ఉండే ఆమె నాకు ఎక్కువగా ఫోన్ చేయదు. కానీ ఆ రోజు అసాధారణంగా తనకు నేను గుర్తొచ్చాను. నా కొడుకు విక్రమ్ పాఠక్ రోదిస్తూ నాకు ఫోన్ చేశాడు. మళ్లీ కాల్ చేస్తానని అంతలోనే ఫోన్ పెట్టేశాడు. విమానం కూలినట్టు నాకు అప్పటికే తెలిసింది. ఏదో ఘోరం జరిగిందని అప్పటికే నా మనసు కీడు శంకించింది’ అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు గంటలకు శాంభవి ఇక లేదన్న చేదు వార్తను వినాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరయ్యారు. గతేడాది మీరా పాఠక్ భర్త మరణించారు. ఆ సందర్భంగా ఇంటికొచ్చిన శాంభవి దాదాపు 13 రోజుల పాటు బామ్మ ఇంట్లోనే గడిపారు. శాంభవి చిన్నతనంలో అధిక భాగం తన ఇంట్లోనే గడిచిందని మీరా పాఠక్ తెలిపారు.


ఇవీ చదవండి:

ప్రభుత్వ లాంఛనాలతో పవార్ అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని

పనిమనుషులుగా చేరి రూ.18 కోట్లు కొట్టేశారు!

Updated Date - Jan 29 , 2026 | 09:33 AM