Share News

బడ్జెట్ 2026: నిర్మలా సీతారామన్ ధరించిన కాంజీవరం పట్టు చీర ప్రత్యేకతలు ఏంటంటే..

ABN , Publish Date - Feb 01 , 2026 | 10:30 AM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ 2026-27ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పించనున్నారామె. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ కాంజీవరం పట్టుచీరలో కనిపించారు. ఆ చీర విశిష్టతలేమిటో తెలుసుకుందాం..

బడ్జెట్ 2026: నిర్మలా సీతారామన్ ధరించిన కాంజీవరం పట్టు చీర ప్రత్యేకతలు ఏంటంటే..
Nirmala Sitharaman

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి 1) 2026-27 బడ్జెట్‌పై పార్లమెంట్‌లో ప్రసంగం చేయనున్నారు. ఇందుకోసం ఆమె ప్రతీ సంవత్సరం లాగే తమిళనాడు పురాతన చేనేత వారసత్వాన్ని గౌరవిస్తూ కాంజీవరం పట్టుచీరను ఎంచుకున్నారు. కేంద్రమంత్రి ధరించిన ఈ చీర మహిళలను ఎంతో ఆకట్టుకుంటోంది. కాంజీవరం పట్టుచీరతో నిర్మలా సీతారామన్ ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ కాంజీవరం పట్టుచీరకు సంబంధించిన విశేషాలేమిటంటే..


కాంజీవరం ప్రత్యేకతలివే..

కాంచీపురం పట్టు చీరలనే కాంజీవరం చీరలు అని కూడా పిలుస్తారు. ఇవి తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ప్రాంతంలో తయారయ్యే సంప్రదాయ చీరలు . ఇవి నాణ్యమైన రంగులు, నైపుణ్యంతో కూడిన చేనేత పనికి ప్రసిద్ధి. 2005-06లో భౌగోళిక గుర్తింపు(జీఐ ట్యాగ్) పొందిన ఈ చీరలు.. వివాహాది శుభకార్యాలు వంటి ప్రత్యేక సందర్భాలలో అధిక ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఈ చీరలను నేయడానికి 10 రోజుల నుంచి నెల రోజుల సమయం పడుతుంది. ఎలాంటి యంత్రాలను ఉపయోగించకుండా కేవలం చేతితోనే వీటిని నేస్తారు.


స్వచ్ఛమైన పట్టు, బంగారు లేదా వెండి జరీతో తయారు చేయడం ఈ చీర ప్రత్యేకత. ఈ చీరలు వాటి సంక్లిష్టత, చేనేత పని కారణంగా అధిక ధరను కలిగి ఉంటాయి. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బంగారు రంగు జరీ చీరతో గోధుమ రంగు గడులు, అలానే కాఫీ బ్రౌన్ అంచుతో ఉన్న చీరను ధరించారు. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భాజపా ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఆ రాష్ట్ర నేపథ్యం ఉన్న కాంజీవరం చీరలో కేంద్ర మంత్రి బడ్జెట్‌ సమర్పించనుండడం చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

బడ్జెట్ 2026.. ఈసారి నిర్మలా సీతారామన్ ఏ చీర ధరించారంటే..

ఈ చిన్న రెడ్ బ్యాగ్‌లో లక్షల కోట్ల బడ్జెట్.. దీని చరిత్ర తెలుసా..

Updated Date - Feb 01 , 2026 | 02:33 PM