బడ్జెట్ 2026.. ఈసారి నిర్మలా సీతారామన్ ఏ చీర ధరించారంటే..
ABN , Publish Date - Feb 01 , 2026 | 09:33 AM
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేకంగా రూపొందించిన చీరలో ఆమె కనిపించారు.
బిజినెస్ డెస్క్: ఏటా బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపుల పైనే కాదు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరల పైనా అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంటుంది. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఆమె ఎంచుకునే చీరలంటే ఎంతో మంది మహిళలకు ఆసక్తి. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎక్కువగా చేనేత చీరలకే ప్రాధాన్యమిస్తోన్న నిర్మలమ్మ.. ఏటా బడ్జెట్ రోజున ఎంచుకునే చీరలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది బడ్జెట్ వేళ.. అదే తరహాలో ఓ ప్రత్యేకమైన చీరలో దర్శనమిచ్చారామె. మరి.. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం...
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఇవాళ(ఆదివారం) ఉదయం 11 గంటలకు బడ్జెట్ 2026-27(Budget 2026-27) ప్రవేశపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేకంగా కాంజీవరం పట్టు చీరను ధరించారు. తమిళనాడు పురాతన నేత వారసత్వాన్ని గౌరవిస్తూ చేతితో నేసిన కాంజీవరం పట్టు చీరను ఆమె ఎంచుకున్నారు . లేత బంగారు గోధుమ రంగు గడులు, కాఫీ బ్రౌన్ అంచుతో ఈ చీరను రూపొదించారు. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు చేనేత చీరను ధరించడం ప్రాధాన్యాతను సంతరించికుంది.
గత బడ్జెట్లలో నిర్మలా సీతారామన్ ధరించిన చీరలు ఇవే..
2019లో రెండోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి ఏటా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రకాల చీరలు ధరించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ చీరలు వివిధ రాష్ట్రాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉన్నాయి. గతేడాది(2025)లో నిర్మలా సీతారామన్ బంగారు వర్ణం అంచుతో ఉన్న క్రీమ్ కలర్ రంగు చేనేత చీరను ధరించారు. ఈ చీరలో బిహార్ రాష్ట్రం మధుబని కళకు సంబంధించిన చిత్రాలు కనిపించాయి. 
2024లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ సందర్భంగా చేనేత చీరను నిర్మలా సీతారామన్ ధరించారు. తెలుపు రంగు, గోల్డ్ మోటిఫ్స్‌తో ఉన్న మెజెంటా అంచు సిల్క్ శారీలో కేంద్రమంత్రి కనిపించారు. అలాగే 2024 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా బ్లూ కలర్ చేనేత చీరలో ఆమె కనిపించారు. అప్పుడు ధరించిన ఈ శారీపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతి ప్రతిబింబించేలా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. దీన్ని అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా ధరించినట్లు ఆమె పేర్కొన్నారు.
2023 బడ్జెట్ సమయంలో ఎరుపు రంగు టెంపుల్ అంచుతో ఉన్న చీరను ఆమె కట్టుకున్నారు.
2022 బడ్జెట్ సందర్భంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన మెరూన్ కలర్ చేనేత చీరను నిర్మల ధరించారు.
2021లో రెడ్- బ్రౌన్ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.
2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో మెరిశారు. ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది. అలాగే ‘ఆస్పిరేషనల్ ఇండియా’ థీమ్‌కు అనుగుణంగా దీనిని ధరించారు.
2019లో తొలి బడ్జెట్ నాడు మంగళగిరి గులాబీ రంగు చీరను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Nirmala Sitharaman Red Pouch: ఈ చిన్న రెడ్ బ్యాగ్‌లో లక్షల కోట్ల బడ్జెట్.. దీని చరిత్ర తెలుసా..