కేంద్ర బడ్జెట్-2026.. ఆదాయపు పన్నులో మార్పులపై సామాన్యుల ఆశలు
ABN , Publish Date - Feb 01 , 2026 | 08:29 AM
ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఆశలు, అంచనాలు భారీగానే ఉన్నాయి. గతేడాది బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం కింద రూ.12లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపునిచ్చారు. మరి ఈ ఏడాది బడ్జెట్లో ఎంతమేరకు మినహాయింపులు ఉంటాయన్నది చర్చనీయాంశమైంది.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 1: భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు (ఆదివారం) ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో 2026-27 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. ముఖ్యంగా ఈసారి బడ్జెట్ పై మధ్యతరగతి ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతేడాది (2025) బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం (New Tax Regime) కింద రూ.12లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపునిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ ఏడాది బడ్జెట్లో ఎంతమేరకు ఆదాయపు పన్ను మినహాయింపులు ఉంటాయన్న దానిపై భారీగానే ఊహాగానాలు ఉన్నాయి.
ముఖ్యమైన అంచనాలు, అంశాలు:
1. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025: 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న 'ఆదాయపు పన్ను చట్టం 2025'పై ఈ బడ్జెట్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది పన్నుల వ్యవస్థను మరింత సరళతరం చేయడమే కాకుండా, పాత చట్టాల్లోని సంక్లిష్టతలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకొచ్చారు.
2. స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction): గతేడాది పెంచిన స్టాండర్డ్ డిడక్షన్‌ను ఈసారి మరింత పెంచుతారని వేతన జీవులు ఆశిస్తున్నారు. ఇది మధ్యతరగతి వారి చేతిలో మరింత నగదు మిగిలేలా చేస్తుంది.
3. కొత్త, పాత పన్ను విధానాలు: ప్రస్తుతం అమల్లో ఉన్న పాత, కొత్త పన్ను విధానాల మధ్య ఎంపికపై పన్ను చెల్లింపుదారుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసే దిశగా ప్రకటనలు ఉండవచ్చు. వ్యాపార ఆదాయం లేని వారు ప్రతి ఏటా ఈ రెండింటి మధ్య మారే అవకాశం ఉంది.
4. మౌలిక సదుపాయాలు, డిజిటలైజేషన్: పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత డిజిటలైజ్ చేయడం, 'ట్యాక్స్ ఇయర్' (Tax Year) అనే ఒకే విధానాన్ని తీసుకురావడం ద్వారా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
గతేడాది (2025) పన్ను స్లాబులు: గత ఏడాది ప్రకటించిన కొత్త పన్ను విధానం ప్రకారం..
రూ. 0 - 4 లక్షలు: సున్నా (0%)
రూ. 4 - 8 లక్షలు: 5%
రూ. 8 - 12 లక్షలు: 10%
రూ. 12 - 16 లక్షలు: 15%
రూ. 16 - 20 లక్షలు: 20%
రూ. 20 - 24 లక్షలు: 25%
రూ. 24 లక్షల పైన: 30%
వార్షిక ఆదాయం రూ.12లక్షల లోపు ఉన్నవారికి రిబేటు ద్వారా పన్ను లేకుండా ఊరట కల్పించారు. మరి ఈసారి బడ్జెట్‌లో నిర్మలమ్మ పన్ను చెల్లింపుదారులకు ఇంకా ఏవైనా అదనపు ప్రయోజనాలు కల్పిస్తారా? అనే దానిపై దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
ఇవీ చదవండి:
బడ్జెట్ 2026.. కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?
మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్