Share News

అమెరికా గ్రీన్ కార్డ్ సస్పెన్షన్‌పై టీసీఎస్ స్పందన..

ABN , Publish Date - Oct 09 , 2026 | 10:32 AM

అమెరికా గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్‌ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసిన నేపథ్యంలో భారత ఐటీ దిగ్గజం టీసీఎస్‌ స్పందించింది. ఈ నిర్ణయం తమ వ్యాపార కార్యకలాపాలు, క్లయింట్ సేవలపై ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది.

అమెరికా గ్రీన్ కార్డ్ సస్పెన్షన్‌పై టీసీఎస్ స్పందన..
Green Card Suspension

అమెరికాలోని ట్రంప్ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్‌ (పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్)పై భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. యూఎస్ లేబర్ డిపార్ట్‌మెంట్ ఇచ్చే ఏ రకమైన ఆదేశాలనైనా పాటిస్తామని, అయితే ఈ నిలిపివేత తమ వ్యాపార కార్యకలాపాలపై గానీ, క్లయింట్ సేవలపై గానీ ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది. అమెరికాలో తమ వ్యూహం ఎప్పుడూ స్థానిక అమెరికన్ ఉద్యోగుల నియామకంపైనే ఆధారపడి ఉంటుందని కంపెనీ తేల్చిచెప్పింది.

గత రెండు సంవత్సరాల్లో తమ PERM (గ్రీన్ కార్డ్) అప్లికేషన్లు కేవలం సింగిల్ డిజిట్ (పది కంటే తక్కువ) లోనే ఉన్నాయని, కాబట్టి ఈ ప్రోగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించడం వల్ల కంపెనీపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదని టీసీఎస్ పేర్కొంది. అమెరికా అంతటా 31 ఆఫీసులు, డెలివరీ సెంటర్లలో స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని.. రాబోయే ఐదేళ్లలో అక్కడ మరో 15,000 మంది స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు తెలిపింది.

నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలను, ఇమ్మిగ్రేషన్ సమస్యలను ఒకే కోణంలో చూడకూడదని ఐటీ పరిశ్రమల సమాఖ్య 'నాస్కామ్' పేర్కొంది. భారతీయ ఐటీ కంపెనీలు గడిచిన కొన్నేళ్లుగా H-1B వీసాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకుని, స్థానికులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పుకొచ్చింది.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వేన్స్, అమెరికా లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ తాజాగా ఈ నిలిపివేత (PERM Program Suspension) గురించి అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా TCS, Infosys, Wipro, Cognizant, HCL, Capgemini లతో పాటు అమెరికన్ టెక్ దిగ్గజాలు Microsoft, Adobe లను కూడా PERM ప్రోగ్రామ్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

(TCS Green Card Suspension)


ఈ వార్తలు కూడా చదవండి:

డిసెంబరులో పార్లమెంటు ముట్టడి

శ్రీవారికి బంగారు పగడాల హారాల కానుక

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 10:46 AM