Share News

ఐటీ, బ్యాంకింగ్ జోష్‌.. భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

ABN , Publish Date - Jul 17 , 2026 | 03:54 PM

గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఎదురైనప్పటికీ ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్ని సాధించాయి. సెన్సెక్స్ ఏకంగా 960 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కీలకమైన 24,300 మార్కును దాటి ముగిసింది.

ఐటీ, బ్యాంకింగ్ జోష్‌.. భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!
Indian Stock Market Surges

ఆంధ్రజ్యోతి, జులై 16: గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఎదురైనప్పటికీ, దేశీయ ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లలో వచ్చిన భారీ కొనుగోళ్ల మద్దతుతో ఇవాళ (శుక్రవారం) ఫ్లాట్ ట్రెండ్‌ను పక్కనబెట్టి దలాల్ స్ట్రీట్ అద్భుతమైన ర్యాలీని సాధించింది. సెన్సెక్స్ ఏకంగా 960 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కీలకమైన 24,300 మార్కును దాటి ముగిసింది.


ఉదయం 77,370.77 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, రోజంతా కొనుగోళ్ల జోరుతో గరిష్ఠంగా 78,282.55 పాయింట్ల స్థాయిని తాకింది. చివరికి.. క్రితం ముగింపు 77,186.87తో పోలిస్తే 964.59 పాయింట్లు (1.25శాతం) లాభపడి 78,151.45 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ కూడా 24,127.60 వద్ద గ్రీన్ మార్క్‌తో ట్రేడింగ్‌ను ఆరంభించి, ఇంట్రాడేలో 24,367.30 గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. అంతిమంగా 261.55 పాయింట్లు (1.09శాతం) ఎగబాకి 24,334.30 వద్ద క్లోజ్ అయింది.


ఐటీ, బ్యాంకింగ్ షేర్ల అండ

జూన్ త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం కావడం మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా అంచనాలకు మించి లాభాలను ప్రకటించడంతో ఐటీ రంగం పరుగులు పెట్టింది. దీనికి తోడు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి లార్జ్ క్యాప్ ఐటీ షేర్లు నిఫ్టీ ర్యాలీని ముందుండి నడిపించాయి. ప్రైవేట్ బ్యాంకింగ్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి హెవీవెయిట్ స్టాక్స్ కూడా మార్కెట్ బుల్లిష్ ట్రెండ్‌కు బలమైన మద్దతునిచ్చాయి.


గ్లోబల్ ఒత్తిడిని అధిగమించిన వైనం

ఆసియా మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ మన మార్కెట్లు సొంత బలంతో రాణించాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా సెంటిమెంట్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ, దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గు చూపారు.


వెనుకబడిన బ్రాడర్ మార్కెట్స్

ప్రధాన సూచీలు దాదాపు ఒక శాతానికి పైగా లాభాల్లో దూసుకుపోయినప్పటికీ.. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ మాత్రం ఇవాళ నిరాశపరిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.41శాతం, 0.21శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ కొనుగోళ్లు కేవలం లార్జ్ క్యాప్ హెవీవెయిట్స్ కే పరిమితం కావడమే ఇందుకు కారణం.


ఈ వారాంతపు ట్రేడింగ్ సెషన్ క్లోజింగ్ మార్కెట్ బలాన్ని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా నిఫ్టీ 24,100 దిగువన బలమైన సపోర్ట్ తీసుకుని సరికొత్త రికార్డుల దిశగా పుంజుకోవడం ఇన్వెస్టర్లకు సానుకూల అంశం. వచ్చే వారం వెలువడనున్న ప్రధాన కార్పొరేట్ కంపెనీల ఫలితాలు, బడ్జెట్ అంచనాలు మార్కెట్ తదుపరి దిశను నిర్దేశించనున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

మూగజీవాలకు అపన్నహస్తం..

తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు

Updated Date - Jul 17 , 2026 | 04:56 PM