ముప్పేట దాడిలో గ్లోబల్ మార్కెట్లు.. $200 దాటనున్న క్రూడాయిల్ ధరలు?
ABN , Publish Date - Mar 28 , 2026 | 01:20 PM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్ల మార్కును చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రజ్యోతి, మార్చి 28: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 200 డాలర్ల మార్కును చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తడం ఖాయంగా చెబుతున్నారు.
ఈ ధరల పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన భయం హోర్ముజ్ జలసంధి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే మొత్తం ముడి చమురులో సుమారు 20 శాతం వాటా ఈ సన్నని జలమార్గం ద్వారానే సాగుతుంది.
సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్ వంటి దేశాల చమురు ఎగుమతులు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ ఈ జలసంధిని మూసివేసినా లేదా అక్కడ యుద్ధం కారణంగా నౌకల రాకపోకలు నిలిచిపోయినా.. రోజుకు లక్షలాది బ్యారెళ్ల సరఫరా ఆగిపోతుంది.
ప్రస్తుతానికి చమురు ధరలు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతింటే మాత్రం పరిస్థితి తారుమారవుతుందని అంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పటికే సరఫరాలో ఇబ్బందులు ఉండగా, ఇప్పుడు పశ్చిమాసియా సంక్షోభం తోడవ్వడం పెను భారంగా మారుతుంది. మరోవైపు, యుద్ధ భయాల వల్ల బీమా కంపెనీలు నౌకలపై అధిక ప్రీమియంలు వసూలు చేస్తాయి. ఇది ఇంధన ధరలను మరింత పెంచుతుంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.
భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయి. రూపాయి విలువ క్షీణించి, కరెంట్ అకౌంట్ లోటు (CAD) పెరిగే ప్రమాదం ఉంది. ఇది స్టాక్ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!
Read Latest Telangana News and National News