Share News

పెట్రోల్‌పై ఎగుమతి సుంకం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 31 , 2026 | 05:10 PM

పెట్రోల్ ఎగుమతులపై విధించే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు ఇవాళ (శనివారం) ఆర్థిక శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

పెట్రోల్‌పై ఎగుమతి సుంకం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో.. ఇంధన ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ఎగుమతులపై విధించే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేసింది. ఈ మేరకు ఇవాళ (శనివారం) ఆర్థిక శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై మాత్రం ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. లీటర్ డీజిల్‌పై విధించే ఎగుమతుల సుంకాన్ని రూ.11.5కు పెంచగా.. లీటర్ ఏటీఎఫ్‌పై రూ.11కు పెంచింది. తాను జారీ చేసిన ఈ ఆదేశాలు తక్షణమే (అంటే అక్టోబర్ 31 నుంచి) అమలవుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.


గతంలో లీటర్ పెట్రోల్‌పై ఎగుమతి సుంకం రూ.2.5 ఉండగా.. ఇప్పుడు దీన్ని కేంద్రం రద్దు చేసింది. లీటర్ డీజిల్‌పై ఎగుమతి సుంకం రూ.8.5 ఉంటే.. ప్రస్తుతం రూ.11.5కు పెంచింది. అంటే ఈ సుంకం మూడు రూపాయలు పెరిగింది. అలాగే ఏటీఎఫ్‌పై రూ.10.5గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీ రూ.11కు పెరిగింది. భారత్‌లో తయారు చేసి ఇతర దేశాలకు పంపించే డీజిల్,ఏటీఎఫ్‌పై ఈ ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో గత మార్చి 27న ‌ఇంధన ఎగుమతులపై భారత్ సుంకాలను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి 15 రోజులకు ఒకసారి ఈ సుంకాలను సవరిస్తూ వస్తోంది.

స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రద్దు చేసినా రిటైల్ మార్కెట్‌లలో పెట్రోల్ ధరలు తగ్గవు. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర హైదరాబాద్‌లో రూ.116.15గా ఉంటే.. విజయవాడలో రూ.117.25గా ఉంది. పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని కేంద్రం రద్దు చేయడం వల్ల ఈ ధరల్లో ఎలాంటి మార్పూ ఉండదు.


ఈ వార్తలూ చదవండి

వెండి ధరలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.10 వేల తగ్గుదల

20 నిమిషాల్లో రూ.60,000 కోట్ల చోరీ!

Updated Date - Oct 31 , 2026 | 05:18 PM