పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ ఏడు మోసాల పట్ల జాగ్రత్త వహించండి..
ABN , Publish Date - Oct 03 , 2026 | 09:41 PM
అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లోన్ సులభమైన మార్గంలా కనిపిస్తుంది. ముఖ్యంగా తక్షణ రుణం, పత్రాలు అవసరం లేదు, వెంటనే రుణం మంజూరు అంటూ వచ్చే ఫోన్ కాల్స్, ప్రకటనలు చాలామందిని ఆకర్షిస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లోన్ సులభమైన మార్గంలా కనిపిస్తుంది. ముఖ్యంగా 'తక్షణ రుణం', 'పత్రాలు అవసరం లేదు', 'వెంటనే రుణం మంజూరు' అంటూ వచ్చే ఫోన్ కాల్స్, ప్రకటనలు చాలామందిని ఆకర్షిస్తాయి. అయితే ఇలాంటి ఆఫర్లలో కొన్ని మోసపూరితమైనవి కూడా ఉండొచ్చు. నకిలీ రుణ యాప్‌లు, ముందుగానే డబ్బు చెల్లించమని అడగడం, బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేయడం వంటి పద్ధతులతో మోసాలు జరుగుతున్నాయి. రుణం తీసుకునే ముందు కింది 7 హెచ్చరికలను తప్పకుండా గమనించాలి (Personal loan scams).
1. నకిలీ రుణ యాప్‌లు
ప్రముఖ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ యాప్‌లాగే కనిపించే కొన్ని నకిలీ యాప్‌లు ఉంటాయి. తక్కువ పత్రాలతో, నిమిషాల్లో రుణం ఇస్తామని అవి చెబుతాయి. అలాంటి యాప్‌లు మీ ఫోన్‌లోని పరిచయాల జాబితా, ఫొటోలు, సందేశాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతులు అడగవచ్చు. కొన్ని సందర్భాల్లో రుణం ఇవ్వకుండానే వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది (Fake loan apps).
2. ముందుగానే డబ్బు అడిగితే..
'రుణం మంజూరైంది.. ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి', 'బీమా రుసుము చెల్లించాలి', 'జీఎస్టీ చెల్లిస్తే వెంటనే డబ్బు వస్తుంది' అంటూ కొందరు మోసగాళ్లు డబ్బు అడుగుతారు. ఇలాంటి డిమాండ్లు మోసానికి సంకేతం కావచ్చు. రుణం ఇవ్వకముందే తెలియని వ్యక్తి ఖాతాకు డబ్బు పంపమని అడిగితే చాలా జాగ్రత్తగా ఉండాలి (Personal loan fraud).
3. ఎలాంటి పరిశీలన లేకుండానే రుణం ఇస్తామంటే?
'మీ ఆదాయం ఎంతైనా సరే, క్రెడిట్ స్కోర్ అవసరం లేదు', 'తనిఖీ లేకుండానే రుణం' అంటూ హామీ ఇచ్చే ఆఫర్లను నమ్మకూడదు. అసలు రుణం ఇవ్వడానికి ముందు రుణగ్రహీత ఆదాయం, ఉద్యోగం, వయస్సు, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి వివరాలను కచ్చితంగా రుణదాతలు పరిశీలిస్తారు. కాబట్టి ఎలాంటి పరిశీలన లేకుండానే భారీ రుణం ఇస్తామని చెప్పడం అనుమానించాల్సిన విషయం.
4. బ్యాంకు లేదా ఆర్బీఐ అధికారి పేరుతో ఫోన్
'మీ రుణం ఆమోదమైంది.. రుణాన్ని విడుదల చేయాలంటే ఓటీపీ చెప్పండి', 'కేవైసీ పూర్తి చేయడానికి యూపీఐ ద్వారా డబ్బు పంపండి' అంటూ ఫోన్ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ పేరు, రుణం మొత్తం వంటి కొన్ని వివరాలు చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తి నిజమైన బ్యాంకు అధికారి అని నమ్మకూడదు. ఓటీపీ, కార్డు వివరాలు, పిన్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి రహస్య సమాచారాన్ని ఫోన్‌లో చెప్పకండి.
5. నకిలీ కేవైసీ లింకులు
'మీ రుణ దరఖాస్తు అసంపూర్తిగా ఉంది', 'కేవైసీ వెంటనే పూర్తి చేయండి' అంటూ సందేశం పంపి ఓ లింక్‌పై క్లిక్ చేయమని కొందరు మోసగాళ్లు చెబుతారు. ఆ లింక్ ద్వారా ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఇతర వ్యక్తిగత పత్రాలను అడగవచ్చు. తెలియని వ్యక్తులు పంపిన లింకుల ద్వారా కేవైసీ పత్రాలను పంపకూడదు. రుణ సంస్థ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారానే అవసరమైన వివరాలను సమర్పించడం సురక్షితం.
6. పాత రుణం తీర్చడానికి మరో రుణం
'మీ ప్రస్తుత రుణాన్ని కొత్త రుణంతో పూర్తిగా తీర్చేయండి.. నెలవారీ వాయిదా తగ్గుతుంది' అంటూ కొందరు కొత్త రుణాలు తీసుకునేలా ప్రోత్సహిస్తారు. కొత్త రుణం తీసుకునే ముందు వడ్డీ, ప్రాసెసింగ్ రుసుము, కాలపరిమితి, మొత్తం తిరిగి చెల్లించాల్సిన డబ్బు వంటి అన్ని వివరాలను పోల్చి చూడాలి (Loan scam warning).
7. నకిలీ రికవరీ ఏజెంట్లు
రుణం తీసుకున్న తర్వాత వాయిదా చెల్లించడంలో ఆలస్యం జరిగితే.. కొందరు మోసగాళ్లు రుణ సంస్థ రికవరీ ఏజెంట్లుగా పరిచయం చేసుకుంటారు. వెంటనే డబ్బు చెల్లించకపోతే కేసు పెడతాం, ఖాతా బ్లాక్ చేస్తాం అంటూ బెదిరించి వ్యక్తిగత యూపీఐ ఖాతాకు డబ్బు పంపమని అడగవచ్చు. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఇవి కూడా చదవండి..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. లీటర్‌కు రూ.5, రూ.3 పెంచిన నయారా ఎనర్జీ
కొడుకును మార్చాలనుకుంది.. చివరకు తానే మారిపోయింది.. ఈ చైనా మహిళ కథేంటంటే..