Share News

2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..

ABN , Publish Date - Feb 01 , 2026 | 03:10 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇవాళ(ఫిబ్రవరి 1) ఆమె 2026-27 ఆర్థిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2019 నుంచి 2026 వరకు ఆమె మొత్తంగా 14 గంటలు బడ్జెట్ ప్రసంగం చేశారు.

 2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..
Nirmala Sitharaman

స్పోర్ట్స్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతదేశ బడ్జెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇవాళ(ఫిబ్రవరి 1) ఆమె 2026-27 ఆర్థిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెట్టిన 9వ కేంద్ర బడ్జెట్ కావడం విశేషం. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఆయన వేరు వేరు ప్రధాన మంత్రుల హయాంలో పద్దులు ప్రవేశపెట్టారు. మొత్తంగా 9 వరుస బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఈ తెలుగింటి కోడలు అరుదైన రికార్డు సృష్టించారు. అయితే నిర్మలా సీతారామన్ 2019 నుంచి నేటి వరకు ఏ బడ్జెట్ ప్రసంగానికి ఎంత సమయం తీసుకున్నారు? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


2019 మే13న కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే కీలక బడ్జెట్లను నిర్మలమ్మ అందించారు. 2019 జులై 5న తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్లు చరిత్రలో నిలిచిపోయాయి. ముఖ్యంగా 2020లో ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు కొనసాగింది. ఇప్పటివరకు ఇదే అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంగా నమోదైంది.


ఆ తర్వాత నుంచి కాలక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగ శైలిలో మార్పు కనిపించింది. ప్రారంభంలో సుదీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగాలు.. తరువాతి సంవత్సరాల్లో క్రమంగా సంక్షిప్తంగా మారాయి. 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం కేవలం 56 నిమిషాల్లో పూర్తైంది. ఇది ఇప్పటివరకు ఆమె చేసిన ప్రసంగాల్లో అతి చిన్న బడ్జెట్ ప్రసంగంగా నిలిచింది. అలాగే 2025 బడ్జెట్ ప్రసంగం కూడా తక్కువ సమయం(74 నిమిషాలు)లోనే పూర్తి కావడం విశేషం.


నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగ సమయం వివరాలివే..

  • 2019 బడ్జెట్: 140 నిమిషాలు (2గం. 20 ని.)

  • 2020 బడ్జెట్: 160 నిమిషాలు (2 గం. 40ని.) (అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం)

  • 2021 బడ్జెట్: 100 నిమిషాలు (1 గం. 40ని.)

  • 2022 బడ్జెట్: 91 నిమిషాలు (1గం. 31ని.)

  • 2023 బడ్జెట్: 87 నిమిషాలు (1 గం. 27ని.)

  • 2024 ఫిబ్రవరి బడ్జెట్: 56 నిమిషాలు(అతి చిన్న బడ్జెట్ ప్రసంగం)

  • 2024 జులై బడ్జెట్: 85 నిమిషాలు (1 గం. 25 ని.)

  • 2025 బడ్జెట్: 74 నిమిషాలు (1 గం. 14 ని.)

  • 2026 బడ్జెట్: 85 నిమిషాలు(1 గం.25ని.)

మొత్తం 9 బడ్జెట్‌లు.. 875 నిమిషాలు (14 గంటల 38 నిమిషాలు)


ఇవి కూడా చదవండి:

ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం

బడ్జెట్ 2026: ఏది చౌకైనది.. ఏది ఖరీదైనది.?

Updated Date - Feb 01 , 2026 | 03:42 PM