Share News

ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:48 PM

1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త 'ఆదాయపు పన్ను చట్టం-2025'ను తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌లో దీనికి సంబంధించిన కీలక మార్పులను ప్రకటించారు.

ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం

  • ట్యాక్స్ నిబంధనల సడలింపు: కేంద్ర మంత్రి నిర్మల

  • ప్రజలే నేరుగా ఐటీ ఫైల్ చేసేలా మార్పులు

  • విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్ టైమ్ స్కీమ్

  • మార్చి 31 వరకు ఐటీ చెల్లింపునకు గడువు

  • జులై 31 వరకు అందుబాటులో ITR 1, ITR2

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి1: 64 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త 'ఆదాయపు పన్ను చట్టం-2025' ను తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌లో దీనికి సంబంధించి కీలక మార్పులను ప్రకటించారు. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానుంది. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా, ట్యాక్స్ ఫైలింగ్‌ను సులభతరం చేసేలా దీనిని రూపొందించారు.

కొత్త ఆదాయపు పన్ను చట్టంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే ప్రధానంగా ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.. చట్టాన్ని సరళీకరించడం, పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను తగ్గించడం కనిపిస్తుంది.


1. సంక్లిష్టతకు స్వస్తి - సరళమైన భాష

పాత చట్టం (1961)లో ఉన్న కఠినమైన న్యాయ పరిభాషను తొలగించి, సామాన్యులకు సులభంగా అర్థమయ్యే భాషలో కొత్త నిబంధనలను రూపొందించారు.

  • సెక్షన్ల తగ్గింపు: గతంలో 819గా ఉన్న సెక్షన్లను 536కు తగ్గించారు.

  • అధ్యాయాల కుదింపు: 47 అధ్యాయాల నుంచి 23కు కుదించడం ద్వారా చట్టాన్ని మరింత స్పష్టంగా మార్చారు.

  • పట్టికలు, ఫార్ములాలు: సుదీర్ఘమైన వివరణలకు బదులుగా, పన్ను లెక్కించడానికి 39 పట్టికలు 40 ఫార్ములాలను చేర్చారు.

2. 'ట్యాక్స్ ఇయర్' విధానం

ఇప్పటివరకు ఉన్న 'ఫైనాన్షియల్ ఇయర్' (ఆదాయం వచ్చే ఏడాది) 'అసెస్మెంట్ ఇయర్' (పన్ను లెక్కించే ఏడాది) అనే రెండు వేర్వేరు సంవత్సరాల గందరగోళాన్ని తొలగిస్తూ, రెండింటినీ కలిపి ఒకే 'టాక్స్ ఇయర్' ప్రభుత్వం మార్చింది. దీనివల్ల ఏ ఏడాది ఆదాయానికి అదే ఏడాది లెక్కలు సరిచూసుకోవడం సులభమవుతుంది.

3. సరళతరమైన ఐటీఆర్ (ITR) ఫారాలు

పన్ను చెల్లింపుదారులు గంటల తరబడి కుస్తీ పట్టాల్సిన అవసరం లేకుండా త్వరలోనే కొత్త ఐటీఆర్ ఫారాలను అందుబాటులోకి తెస్తున్నారు.

  • ముందుగా నింపిన ఫారాలు (Pre-filled Forms): మీ జీతం, బ్యాంక్ వడ్డీ వంటి వివరాలు ఇప్పటికే ఫారంలో నింపి ఉంటాయి. మీరు కేవలం వాటిని సరిచూసుకుని 'సబ్మిట్' చేస్తే సరిపోతుంది.

  • AI వినియోగం: పన్ను నోటీసుల జారీ, అప్పీళ్ల ప్రక్రియలో వేగాన్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

Updated Date - Feb 01 , 2026 | 01:33 PM