Share News

New Rules On Jan 1: నేటి నుంచి కొత్త రూల్స్ అమలు.. అవేంటో తెలుసా?

ABN , Publish Date - Jan 01 , 2026 | 07:53 AM

నేటి నుంచీ అనేక కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రాబోయే నెలల్లో మరికొన్ని అమల్లోకి రానున్నాయి. వీటిపై పూర్తి అవగాహన పెంచుకుంటే ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.

New Rules On Jan 1: నేటి నుంచి కొత్త రూల్స్ అమలు.. అవేంటో తెలుసా?
New Financial Rules 2026

ఇంటర్నెట్ డెస్క్: కొత్త సంవత్సరం ప్రారంభమైంది. కోటి ఆశలతో భారతీయులు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. అయితే, పలు ఆర్థిక అంశాలకు సంబంధించి నేటి నుంచే పలు రూల్స్ అమల్లోకి వచ్చాయి. మరికొన్నేమో రాబోయే నెలల్లో అమల్లోకి రానున్నాయి. ఈ రూల్స్‌పై అవగాహన పెంచుకుంటే నిశ్చితంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

ఆధార్-పాన్ అనుసంధానం

పాన్, ఆధార్ కార్డులను అనుసంధానించాలని కేంద్రం ఎప్పటి నుంచో ప్రజలను అభ్యర్థిస్తోంది. లింకప్ లేని బ్యాంకు ఖాతాలు, ఇతర సేవలు నిలిచిపోతాయని హెచ్చరిస్తోంది. కాబట్టి, ఇవి లింక్ చేసుకోని వారు ఇకపై చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇక కొత్త ఏడాదిలో తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులు తమ క్రెడిట్‌కార్డుదారులు, ఇతర వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తేచ్చాయి.

క్రెడిట్ స్కోర్ అప్‌డేషన్

క్రెడిట్ స్కోరు అప్‌డేష్ కాల వ్యవధి కూడా నేటి నుంచీ మారనుంది. గతంలో 15 రోజులకు ఒకసారి చొప్పున రుణగ్రహీత క్రెడిట్ స్కోరు‌ను తాజా పరుస్తుండేవారు. ఇకపై వారానికి ఒకసారి చొప్పున అప్‌డేట్ చేస్తారు. రుణం చెల్లింపుల్లో జాప్యం చేసేవారిపై తాజా నిబంధనలతో తక్షణ ప్రభావం పడే అవకాశం ఉంది.

కొత్త పన్ను చట్టం అమలు

1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచీ అమల్లోకి రానుంది.


కొత్త ఐటీ రిటర్న్స్

ఐటీ రిటర్న్స్ దాఖలు ప్రక్రియను మరింత సులభతరం చేసేలా కొత్త ఫారాలు నేటి నుంచీ అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో బ్యాంకింగ్‌ లావాదేవీలు, ఖర్చుల వివరాలు ముందుగానే నింపి ఉండటంతో మొత్తం ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

స్టార్ లేబుల్స్

ఇంధన సామర్థ్యానికి సంబంధించిన స్టార్ లేబుల్స్ నిబంధన మరింత విస్తృతమైంది. డీప్ ఫ్రీజర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ఇన్వర్టర్లకూ ఇవి వర్తిస్తాయని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇటీవల గెజిట్‌లో పేర్కొంది. గృహోపకరణాల విషయంలో ఇప్పటికే ఇది అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

బీఈఈ కొత్త నిబంధనలు.. ధరల్లో పెరుగుదల

కొత్త ఏడాదిలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు కూడా పెరగనున్నాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ నూతన ప్రమాణాల ప్రకారం తయారయ్యే వస్తువుల ధరలు 5 శాతం వరకూ పెరగొచ్చు. నిబంధనలను కఠినతరం కావడంతో ప్రస్తుత 5 స్టార్ ఉపకరణాలు, ఫోర్ స్టార్‌గా, 4 స్టార్ ఉపకరణాలు 3 స్టార్‌గా మారనున్నాయి. రేటింగ్ పెంచేందుకు అదనపు ఖర్చుతో వీటిని మరింత సమర్థవంతంగా తయారు చేయాల్సి ఉంటుంది.

కార్ల ధరల పెరుగుదల

నేటి నుంచీ కార్ల ధరలు పెరగనున్నాయి. కంపెనీలను బట్టి కార్ల ధరలు 0.6 శాతం నుంచి 3 శాతం వరకూ పెరగనున్నాయి. తయారీ ఖర్చులు పెరగడం, రూపాయి విలువ క్షీణిస్తుండటంతో ధరలు పెంచక తప్పటం లేదని ఇప్పటికే పలు కంపెనీలు ప్రకటించాయి.


8వ పే కమిషన్

నేటి నుంచి 8వ పే కమిషన్ అమల్లోకి వచ్చింది. అయితే, పెరిగిన జీతాలు మాత్రం అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తరువాతే ఉద్యోగులకు అందుతాయి. 2027 మే తరువాత ఇది సాధ్యమని పరిశీలకులు చెబుతున్నారు.

గ్యాస్ ధరల సవరణ

గృహ వినియోగానికి ఉద్దేశించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లతో పాటు కమర్షియల్ సిలిండర్ల ధరలను కూడా సవరించే అవకాశం ఉంది. విమాన ఇంధన ధరలను కూడా సవరించనున్నారు.

పీఎమ్ కిసాన్ పథకం-కొత్త ఐడీలు

పీఎమ్ కిసాన్ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు కేంద్రం కొత్త ఐడీలు జారీ చేసేందుకు నిర్ణయించింది. జనవరి 1 నుంచి కొత్త దరఖాస్తుదారులందరికీ దీన్ని జారీ చేయనున్నారు. ఈ డిజిటల్ ఐడీతో రైతుల వివరాలు, పంట వివరాలను లింక్ చేయనున్నారు.

ఇవీ చదవండి

వరుసగా మూడో రోజూ తగ్గిన పసిడి రేట్లు.. నేటి ధరలివే..

2026లో రూ.4 లక్షల కోట్ల ఐపీఓలు

Updated Date - Jan 01 , 2026 | 08:38 AM