Share News

భారీగా క్రెడిట్ కార్డులు ఉన్నా.. సిబిల్ స్కోర్ పొందడం ఎలా..?

ABN , Publish Date - Apr 16 , 2026 | 08:49 AM

మనీ పర్సులో ఎన్ని క్రెడిట్ కార్డులు ఉంటే అంత గొప్ప అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది తప్పని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డును ఎంత నియంత్రణతో ఎలా వినియోగించామనే అంశాన్ని రుణ దాతలు పరిశీలిస్తారని స్పష్టం చేస్తున్నారు.

భారీగా క్రెడిట్ కార్డులు ఉన్నా.. సిబిల్ స్కోర్ పొందడం ఎలా..?

న్యూఢిల్లీ, ఏప్రిల్16: మనీ పర్సులో ఎన్ని క్రెడిట్ కార్డులు ఉంటే అంత గొప్ప అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది తప్పని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డును ఎంత నియంత్రణతో ఎలా వినియోగించామనే అంశాన్ని రుణ దాతలు పరిశీలిస్తారని స్పష్టం చేస్తున్నారు. ప్రతి నెల క్రెడిట్ కార్డును ఎలా వాడుతున్నారు. ఎంతలా వాడుతున్నారు. క్రమశిక్షణతో కూడిన నియంత్రణతో ఈ కార్డును వినియోగిస్తున్నారా? అనే అంశాన్ని రుణ దాతలు పరిశీలిస్తారని చెబుతున్నారు.


ఒకటి కంటే ఎక్కువ కార్డులు కలిగి ఉండటం సమస్య కాదని జెట్ (ZET) సహ వ్యవస్థాపకుడు, సీఈవో మనీశ్ షారా తెలిపారు. దీని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. కానీ మీరు క్రెడిట్ కార్టు వినియోగించే విధానంపై క్రెడిట్ స్కోరింగ్ ఆధారపడి ఉంటుందన్నారు. చాలా మంది వినియోగదారులు అక్కడే తప్పు చేస్తారని అంటున్నారు. ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నా.. ఒక్కొక్క దానిని వినియోగించే విధానంపైనే అది ఉంటుందని చెబుతున్నారు.


ఒకటి కంటే ఎక్కువ కార్డులు కలిగి ఉంటే.. వాటిని మనకు తగినట్లుగా వాడుకోవచ్చని ఫిక్స్‌మైస్కోర్, క్రెడ్‌జెనిక్స్ సహ వ్యవస్థాపకుడు ఆనంద్ అగర్వాల్ అభిప్రాయపడుతున్నారు. ఒకటి నిత్యావసరాల కోసం, మరొకటి ప్రయాణం కోసం, ఇంకోటి భారీ కొనుగోళ్ల కోసం వినియోగించకో వచ్చని సూచిస్తున్నారు. మీకు అధిక క్రెడిట్ పరిమితి ఉన్నప్పుడు.. మీ ఖర్చు దానిలో తక్కువ శాతంగా ఉంటుందని.. అది మీ క్రెడిట్ స్కోర్‌కు సహాయపడుతుందని వివరిస్తున్నారు.


గడువు తేదీని గమనించడం, అధిక ఖర్చులను నివారించడంతోపాటు బిల్లులను పూర్తిగా చెల్లించడం వంటి క్రమశిక్షణ పాటించాలి. అలా అయితేనే ఎన్ని కార్డులు ఉన్నా.. మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను బలోపేతం చేస్తాయని ఒలివ్ సహ వ్యవస్థాపకుడు, సీపీవో వినయ్ సింగ్ స్పష్టం చేస్తున్నారు.


అధిక క్రెడిట్ కార్డులతో నష్టపోయేది ఇక్కడే..

1. ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డులు ఉన్నట్లయితే.. ఒక్కో కార్డు బిల్లు ఒక్కో తేదీన ఉంటుంది. ఆ తేదీలన్నింటినీ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

2. చాలా మంది మినిమం చెల్లింపులు చేస్తుంటారు. దీనివల్ల అప్పుల భారం మరింత పెరుగుతుంది.

3. క్రెడిట్ కార్డులు అధికంగా ఉండటం వల్ల చెల్లింపు తేదీలను మర్చిపోయే అవకాశం ఉంటుంది. అదే జరిగితే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.

ఈ తరహా పొరపాట్ల వల్ల క్రమశిక్షణతో నెలల తరబడి చెల్లింపులు చేసినా.. నష్టం మాత్రం తప్పదు. అందుకే.. గరిష్టంగా రెండు లేదా మూడు కార్డులకు పరిమితం అవడం ఉత్తమం అని విభావంగళ్ వ్యవస్థాపకుడు, ఎండీ సిద్ధార్థ్ మౌర్య సూచిస్తున్నారు.


చాలా మంది 30 శాతం నియమాన్ని ఉల్లంఘిస్తారని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశాారు. మీ మొత్తం క్రెడిట్‌ పరిమితిలో 30 శాతం కంటే తక్కువ ఉపయోగించాలని వారు స్పష్టం చేస్తున్నారు. వివిధ కార్డుల మధ్య ఖర్చులను విభజించడం సురక్షితమని వారు చెబుతున్నారు. వినియోగం అధికంగా ఉంటే.. ఇది క్రెడిట్ స్కోర్‌పై ఒకే విధమైన ప్రభావం ఉంటుందని అంటున్నారు. 50 శాతం వినియోగం దాటినా.. మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని రుణదాతలకు తెలిసిపోతుందని చెబుతున్నారు. మీరు.. మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. క్రెడిట్ కార్డుల వినియోగాన్ని 10 శాతం లోపు ఉంచుకోవాలని సూచిస్తున్నారు.


అధిక వడ్డీ చెల్లించడాన్ని నివారించాలి..

క్రెడిట్ కార్డులు ఖరీదైనవి కావని.. బ్యాలెన్స్ ఉంచుకోవడమే ఖరీదైనదని స్పష్టం చేస్తున్నారు. మీకు ప్రతి కార్డు 18 నుంచి 45 రోజుల వరకు వడ్డీ రహిత గడువు వెసులుబాటును కల్పిస్తుంది. మీరు గడువు తేదీలోపు స్టేట్‌‌మెంట్ బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లిస్తే.. అది స్వల్పకాలిక క్రెడిట్ అవుతుందంటున్నారు.


క్రెడిట్ పరిమితిని చేరుకోవడం.. మీ స్కోర్‌ను ఎందుకు దెబ్బతీస్తుందంటే..

నేను సమయానికి చెల్లిస్తున్నాను.. అయినా నా క్రెడిట్ స్కోరు ఎందుకు పడిపోతుందని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే.. మీరు చెల్లిస్తున్నారా? లేదా అని రుణదాతలు చూడరు. మీకు క్రెడిట్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో అని వారు గమనిస్తారనే విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. తరచూ పరిమితికి మించి ఖర్చు చేయడం.. ఖర్చుల్లో ఆకస్మిక పెరుగుదల.. కనీస చెల్లింపులపై ఆధారపడటం వంటి అంశాలను ఆర్థిక ఒత్తిడికి సంకేతాలుగా పరిగణిస్తారు.


క్రెడిట్ కార్డులు వ్యూహాత్మకంగా వినియోగిస్తే.. క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు, రివార్డులు, క్యాష్ బ్యాక్ వస్తాయి, అత్యవసర నిల్వలు వెసులుబాటు కల్పిస్తుంది, ఉచిత స్వల్ప కాలిక క్రెడిట్ అందించబడుతుంది.

కానీ, అజాగ్రత్తగా వాడితే మాత్రం.. అవి అత్యంత ఖరీదైన రుణంగా మారతాయి. క్రెడిట్ కార్డులు ఆర్థిక సమస్యలు సృష్టించవు. వాటిపై అవగాహన లేకుంటే మాత్రం.. సమస్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఎన్ని కార్డులు కలిగి ఉన్నాయి.. ఆయా కార్డులను వినియోగించినప్పుడు 30 శాతానికి మించకుండా చూసుకోవడంలోనే మీ ప్రయోజనం దాగి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గోల్డ్, సిల్వర్ ధరల్లో క్రమంగా పెరుగుదల

స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్.. కాకినాడ తరలింపు

For More Business News And Telugu News

Updated Date - Apr 16 , 2026 | 09:45 AM