మెరుపు వేగంతో పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! నేటి రేట్స్ చూస్తే..
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:27 AM
అమెరికా ప్రభుత్వ నిర్ణయాలతో పసిడి, వెండికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పసిడి, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలైన బంగారం, వెండి వైపు మళ్లుతున్నారు. దీంతో, వీటికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ ధరలు చుక్కలనంటుతున్నాయి. అన్ని దేశాల్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. భారత్‌లో గురువారం తగ్గినట్టే తగ్గిన ధరలు శుక్రవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.2800 మేర, కిలో వెండి రూ.20 వేల మేర పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,720గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,46,410 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, వైజాగ్‌లల్లో కూడా ధరలు దాదాపుగా ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ముంబైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం అత్యల్పంగా రూ.1,54,320 వద్ద ట్రేడవుతోంది (Gold, Silver Rates on Jan 24).
నగరంలో వెండి ధరలు కూడా శుక్రవారం అమాంతం పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.3.60 లక్షలుగా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ధరలు తారస్థాయికి చేరుకున్నాయి. ఔన్స్ 24 క్యారెట్ బంగారం స్పాట్ ధర 4,989 డాలర్లు చేరింది. ఔన్స్ వెండి ధర 103 డాలర్ల వద్ద తచ్చాడుతోంది.
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్‌పై ట్రంప్ మరోమారు విమర్శలు గుప్పించడంతో మార్కెట్ సెంటీమెంట్ దెబ్బతింది. దీంతో, ప్రభుత్వ బాండ్స్, కరెన్సీలను కాదనుకుంటున్న ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలైన బంగారం, వెండి వైపు మళ్లుతున్నారు. ఫలితంగా ధరలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక పారిశ్రామికంగా ఉపయోగించే వెండి ధరల్లో పెరుగుదల బంగారాన్ని మించిపోతోంది. గత 12 నెలల్లో సిల్వర్ ధరలు 200 శాతం మేర పెరగ్గా బంగారం ధరలు 80 శాతం మేర పెరిగాయి.
ఇవీ చదవండి:
ఏజెంటిక్ ఏఐలో కొలువులే కొలువులు
మళ్లీ నష్టాల బాట పట్టిన సూచీలు.. ఒత్తిడిలో అదానీ గ్రూప్ షేర్లు..