EPFO: గుడ్ న్యూస్.. త్వరలోనే పీఎఫ్ డబ్బులు మీ అకౌంట్‌లో..
ABN , Publish Date - Jan 17 , 2026 | 08:15 PM
పీఎఫ్ ఖాతాదారులకు గొప్ప శుభవార్త. ఈపీఎఫ్‌వో త్వరలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు సిద్దమవుతోంది. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి..
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 8 కోట్ల మంది ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు పండగలాంటి వార్త. పీఎఫ్ (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్ఓ (EPFO) త్వరలోనే విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త అప్‌డేట్ నిజంగా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. పీఎఫ్ విత్‌డ్రా విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ప్రస్తుతం అనేక కార్యాచరణలకు రంగం సిద్ధం చేస్తోందని.. కేంద్ర కార్మిక శాఖా మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇప్పటికే వెల్లడించారు.
ఈ సదుపాయం ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుందని కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవస్థను సజావుగా అమలు చేసేందుకు ఈపీఎఫ్‌వో అవసరమైన సాఫ్ట్‌వేర్ మార్పులు చేస్తోంది. ఈ కొత్త పద్దతి ప్రకారం.. ఈపీఎఫ్ మొత్తం కొంత భాగం మినహా, మిగతా మొత్తం వాటాను చందాదారులు.. తమ బ్యాంక్ ఖాతా ద్వారా, యూపీఐ ద్వారా సెకన్లలో నగదును మీ బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. అత్యవసర వైద్య ఖర్చులు లేదా చిన్న చిన్న అవసరాల కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఇప్పటికే ఆటో-సెటిల్‌మెంట్ విధానంలో విద్య, అనారోగ్యం, వివాహం, గృహ నిర్మాణం వంటి అవసరాల కోసం చేసుకునే క్లెయిమ్‌లను మూడు రోజుల్లోనే పరిష్కరిస్తున్నారు. ఈ విధానంలో రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉంది. కొత్త విధాంలో తమ ఖాతాలోని అర్హత ఉన్న బ్యాలెన్స్ 100 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఖాతాదారులు చక్రవడ్డీ ప్రయోజనాలు, 8.25 శాతం వడ్డీ రేటును నష్టపోకుండా ఉండాలంటే మాత్రం ఖాతాలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ కొనసాగించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. మొత్తం 13 రకాల పరిస్థితులు ఏర్పడినపుడు మాత్రమే డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. వీటిని మొత్తం మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో అత్యవసరాలు, ఇంటి అవసరాలు, ప్రత్యేక అవసరాలుగా వీటిని విభజించారు.
ఇవీ చదవండి
కర్ణాటకలో బాలుడికి భారీగా బంగారు నాణేలు లభ్యం.. రంగంలోకి ప్రభుత్వం
గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి గెలుపు