వాహనం.. వృద్ధి చోదకం
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:31 AM
దేశ ఆర్థిక వృద్ధికి కీలక చోదకాల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒకటని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) పేర్కొంది. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వాహన రంగం వాటా రూ.22.75 లక్షల కోట్ల పైమాటేనని చెప్పింది.
జీడీపీలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాటా రూ.22.75 లక్షల కోట్లు
జీఎ్‌సటీ ఆదాయంలో దాదాపు15 శాతం ఆటో రంగం నుంచే..
3 కోట్ల మందికి పైగా ఉపాధి
సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధికి కీలక చోదకాల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒకటని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) పేర్కొంది. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వాహన రంగం వాటా రూ.22.75 లక్షల కోట్ల పైమాటేనని..ప్రభుత్వ జీఎస్‌టీ ఆదాయంలో దాదాపు 15 శాతం తమ పరిశ్రమ నుంచే సమకూరుతోందని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర అన్నారు. అంతేకాదు, వాహన పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్లకు పైగా మందికి ఉపాధి కల్పిస్తోందని.. సంబంధిత రంగాల అభివృద్ధికి, సరఫరా వ్యవస్థకూ మద్దతిస్తోందన్నారు. గురువారం జరిగిన సియామ్ 66వ వార్షిక సదస్సులో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇంకా ఏమన్నారంటే..
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ప్యాసింజర్ వాహన విభాగ దేశీయ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 7.9 శాతం వృద్ధితో సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 46 లక్షల యూనిట్లకు పెరిగాయి. ఈ విభాగ ఎగుమతులు సైతం 17.5 శాతం పెరుగుదలతో రికార్డు గరిష్ఠ స్థాయి 9.1 లక్షల యూనిట్లకు చేరాయి.
ద్విచక్ర వాహన విభాగ దేశీయ అమ్మకాలు కూడా 10.7 శాతం వృద్ధితో సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి 2.171 కోట్ల యూనిట్లకు పెరిగాయి. టూవీలర్ ఎగుమతులు 23.4 శాతం పెరిగి 51.8 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.
త్రిచక్ర వాహనాల దేశీయ విక్రయాలు 12.8 శాతం పెరుగుదలతో 8.4 లక్షల యూనిట్లకు చేరగా.. ఎగుమతులు ఏకంగా 50.1 శాతం ఎగబాకి 4.6 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.
వాణిజ్య వాహనాల దేశీయ విక్రయాలు 12.6 శాతం వృద్ధితో సరికొత్త రికార్డు స్థాయి 10.80 లక్షల యూనిట్లకు పెరగగా.. ఎగుమతులు 17.4 శాతం పెరుగుదలతో 95,000 యూనిట్లుగా నమోదయ్యాయి.
2025 ఏప్రిల్ 1 నుంచి దేశీయ వాహన పరిశ్రమ మొత్తం ఈ-20 పెట్రోల్‌కు అనుగుణమైన వాహనాలను తయారు చేస్తోంది. ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు ఇది మద్దతివ్వనుంది.
సియామ్ కొత్త ప్రెసిడెంట్ శేను అగర్వాల్
సియామ్ కొత్త ప్రెసిడెంట్‌గా అశోక్ లేలాండ్ ఎండీ, సీఈఓ శేను అగర్వాల్ గురువారం నియమితులయ్యారు. 2026-27 సంవత్సరానికి గాను ఈయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇప్పటి వరకు ఈయన సియామ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. కాగా వైస్ ప్రెసిడెంట్‌గా టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్, ట్రెజరర్‌గా మెర్సిడెస్ బెంజ్ ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ నియ మితులయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2028 నాటికి వాణిజ్య వాహన మార్కెట్లో 10శాతం వాటా లక్ష్యం
2027 అక్టోబరు నుంచి భారత్ ఎన్‌క్యాప్ 2.0
Read Latest Telangana News And AP News And National News
And Telugu News