ముందుగా అండర్ పాసేజ్‌లు
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:24 AM
Underpasses at two locations in Ichchapuram ఇచ్ఛాపురంలో ఎట్టకేలకు రైల్వేఅండర్ పాసేజ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇచ్ఛాపురం పట్టణాన్ని విభజిస్తూ రైల్వేలైన్ ఉంది. పట్టణ ప్రజలతోపాటు ఒడిశా ప్రజలు ఇచ్ఛాపురం రావాలంటే రైల్వేగేట్లు దాటాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర కిందట రెండుచోట్ల ఫ్లైఓవర్లు, రెండుచోట్ల అండర్ పాసేజ్‌లకు ప్రతిపాదనలు చేశారు. వీటిలో ముందుగా అండర్ పాసేజ్ పనులకుగానూ శుక్రవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు భూమి పూజ చేయనున్నారు.
ఇచ్ఛాపురంలో రెండుచోట్ల పనులు
నేడు భూమిపూజ చేయనున్న కేంద్రమంత్రి
మరో 12 చోట్ల వంతెనల ఏర్పాటుకు చర్యలు
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురంలో ఎట్టకేలకు రైల్వేఅండర్ పాసేజ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇచ్ఛాపురం పట్టణాన్ని విభజిస్తూ రైల్వేలైన్ ఉంది. పట్టణ ప్రజలతోపాటు ఒడిశా ప్రజలు ఇచ్ఛాపురం రావాలంటే రైల్వేగేట్లు దాటాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర కిందట రెండుచోట్ల ఫ్లైఓవర్లు, రెండుచోట్ల అండర్ పాసేజ్‌లకు ప్రతిపాదనలు చేశారు. వీటిలో ముందుగా అండర్ పాసేజ్ పనులకుగానూ శుక్రవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు భూమి పూజ చేయనున్నారు. దీంతో పట్టణవాసులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఒడిశావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది మార్చిలో ఇచ్ఛాపురం - పలాస మధ్య 12 ఫ్లైఓవర్‌లతోపాటు అండర్‌పాసేజ్‌ల నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతులిచ్చింది. అందులో భాగంగా ఇచ్ఛాపురంలోని సంతపేట, రైల్వేనార్త్ కేబిన్ సమీపంలో రెండుచోట్ల అండర్ పాసేజ్‌ల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. నిర్మాణసామగ్రి సిద్ధం చేశారు. అయితే రైల్వేజోన్ మార్పు, డివిజన్ల మార్పుతో పనుల్లో జాప్యమైంది. ప్రస్తుతం ఇచ్ఛాపురం నుంచి అంతా విశాఖ కేంద్రంగా ఏర్పడిన కొత్త డివిజన్‌లో చేర్చడంతో అండర్ పాసేజ్‌లతోపాటు వంతెనల నిర్మాణానికి అవకాశం దక్కింది. ముందుగా పలాస, ఇచ్ఛాపురం స్టేషన్ల మధ్య అండర్ పాసేజ్‌ల నిర్మాణం పూర్తికానుంది. 12 చోట్ల వంతెనల నిర్మాణానికి భూసేకరణ, ఇతరత్రా సమస్యలు పరిష్కరించి పనులు పూర్తిచేయాలని రైల్వేశాఖ భావిస్తోంది.
వంతెనలు ఎక్కడెక్కడంటే..
ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు సమీపంలో రైల్వేక్రాసింగ్ నంబర్ 326, 329, 330, 334 వద్ద వంతెనలు రానున్నాయి. అంటే ఇచ్ఛాపురం పట్టణంతోపాటు రూరల్ పరిధిలో నాలుగు రహదారులకు ఫ్లైఓవర్లు రానున్నాయి. జాడుపూడి రైల్వేస్టేషన్ పరిధిలో 341 లెవల్ క్రాసింగ్ వద్ద, సోంపేట రైల్వేస్టేషన్ పరిధిలో 343 రైల్వే క్రాసింగ్ వద్ద వంతెన రానుంది. సోంపేట-బారువ రైల్వేస్టేషన్ల మధ్య 345, 348, 351 లెవల్ క్రాసింగ్ల వద్ద.. బారువ నుంచి మందస రైల్వేస్టేషన్ల మధ్య 353, 354, 358 లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెనలు నిర్మించనున్నారు.
గేటుపడితే నరకమే..
జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల ప్రజలకు రైల్వేగేట్లు నరకయాతన చూపిస్తుంటాయి. పలాస-కాశీబుగ్గ పట్టణ ప్రజలు వెళ్లాలంటే కాశీబుగ్గ సమీపంలోని ఎల్‌సీ గేటును దాటాలి. అటు వజ్రపుకొత్తూరు వెళ్లాలంటే తాళ్లభద్ర ఎల్‌సీ గేటు దాటాలి. ఈ రెండు గేట్లు పలాస రైల్వేస్టేషన్‌కు అటు ఇటుగా ఉంటాయి. దీంతో రైలు ఆగినా.. నిలిచినా.. గేటు అలానే మూసి వేసి ఉంటుంది. మందస మండల ప్రజలకు కొర్రాయిగేటు, బాలిగాం, కొత్తపల్లి గేట్లు నరకయాతన చూపిస్తుంటాయి. ఇక సోంపేట మండలంలో పాలవలస, కొర్లాం గేట్ల వద్ద నిత్యం అదే పరిస్థితి. కంచిలి మండలానికి సంబంధించి బూరగాం, అంపురం, గొల్ల కంచిలి రైల్వేగేటుతో నిత్యం ప్రజలకు యాతన తప్పదు.
ఇచ్ఛాపురం పట్టణాన్ని వేరుచేస్తూ ఉంటుంది రైల్వేలైన్. సగం పట్టణం రైల్వేలైన్ అవతల ఉంటుంది. పురుషోత్తపురం, రత్తకన్న, జగన్నాథపురం గేట్లు నరకయాతన చూపిస్తుంటాయి. అయితే ఎట్టకేలకు రెండుచోట్ల అండర్ పాసేజ్‌ల నిర్మాణంతో ఇబ్బందులు తొలగనున్నాయి. మరోవైపు వంతెనలు నిర్మించనుండడంతో ప్రజలకు కష్టాలు తప్పనున్నాయి. వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని రెండు నియోజకవర్గాల ప్రజలు కోరుతున్నారు.
చురుగ్గా ఏర్పాట్లు
ఇచ్ఛాపురంలో రెండుచోట్ల అండర్ పాసేజ్‌ల నిర్మాణం జరగనుంది. ఇక పట్టణంలో మరో రెండుచోట్ల వంతెనల నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గంలో 12 చోట్ల వంతెనలకు సంబంధించి భూసేకరణతో పాటు ఇతర అంశాలకు సంబంధించి కసరత్తు జరుగుతోంది.
- శ్రీనివాస రౌళో, జెడ్‌ఆర్సీ సభ్యుడు, ఇచ్ఛాపురం