Share News

మొబైల్‌ రీఛార్జిలను కూల్‌డ్రింక్‌, చిప్స్‌తో పోల్చిన సునీల్ మిత్తల్!

ABN , Publish Date - Nov 13 , 2026 | 08:53 PM

భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్‌లో టెలికాం టారిఫ్‌లు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. కూల్‌డ్రింక్‌, చిప్స్‌ ప్యాకెట్‌ కంటే మొబైల్‌ రీఛార్జి ధరలే తక్కువ ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

మొబైల్‌ రీఛార్జిలను కూల్‌డ్రింక్‌, చిప్స్‌తో పోల్చిన సునీల్ మిత్తల్!
Sunil Mittal

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ (Sunil Mittal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్‌లో టెలికాం టారిఫ్‌లు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. అంతేకాక కూల్‌డ్రింక్‌, చిప్స్‌ ప్యాకెట్‌ కంటే మొబైల్‌ రీఛార్జి ధరలే తక్కువ ఉన్నాయని మిత్తల్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల సగటున నెలకు సుమారు రూ.350 వరకు చెల్లించడం సముచితంగా ఉంటుందని ఆయన తెలిపారు. భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ అర్ధ శతాబ్ధం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


మొబైల్‌ కనెక్షన్‌ ద్వారా ఒకప్పటిలా వినియోగదార్లు కేవలం కాలింగ్ మాత్రమే చేయడం లేదని, బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, విద్య, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వంటివి వినియోగిస్తున్నారని సునీల్‌ మిత్తల్‌ అన్నారు. ఈ సేవలకుగానూ టెలికాం వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తం చాలా తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. టెలికాం టారిఫ్ సగటున నెలకు రూ.350 ఉంటే సమంజసంగా ఉంటుందని, ఆ లెక్కన రోజుకయ్యే ఖర్చు రూ.10-12 మాత్రమేనని మిత్తల్ పేర్కొన్నారు.


నెట్‌వర్క్ నిర్వహణ వ్యయం, ఉద్యోగుల జీతాలు, విద్యుత్ ఛార్జీల రూపంలో ఖర్చులు భారీగా పెరిగాయని మిత్తల్ వెల్లడించారు. మరోవైపు చైనాలో 10 లక్షలకు పైగా మొబైల్‌ టవర్లు ఉండగా.. భారత్‌లో 3.5 లక్షలు మాత్రమేనన్నారు. ప్రస్తుతం ఉన్న టవర్ మౌలిక సదుపాయాలను కనీసం రెట్టింపు చేయాలి. ఫైబర్ కనెక్టివిటీ, బ్‌మెరైన్ కేబుల్ నెట్‌వర్క్‌లను విస్తరించడానికి కూడా గణనీయమైన ఖర్చు అవుతుంది. అందుకోసం మరో రూ.1.5 లక్షల కోట్లు అవసరం పడుతుందని చెప్పారు.


టెలికాం యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.300 ఉండాలని గతంలో సునీల్‌ మిత్తల్‌ పలుమార్లు ప్రస్తావించారు. తాజాగా ఆ మొత్తం రూ.350కి చేరితే సమంజసంగా ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే టెలికాం ఛార్జీల పెంపు ఉంటుందని భావిస్తున్న వేళ.. ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, టారిఫ్ ధరల పెంపు ఎప్పుడు అని ప్రశ్నించగా.. తనకు తెలియదంటూ సమాధానం దాటవేశారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ఎయిర్‌టెల్‌ వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం(ARPU) రూ.271గా ఉంది.


ఈ వార్తలూ చదవండి

నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్‌-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..

Updated Date - Nov 13 , 2026 | 09:08 PM