చంద్రగిరిలో క్రాస్‌ఓటింగ్
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:50 AM
ప్రతిష్ఠాత్మక చంద్రగిరి నియోజకవర్గంలో పాలక టీడీపీకి గట్టి షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడి తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు..
3 జడ్పీటీసీల్లో టీడీపీకి షాక్
తిరుపతి రూరల్‌లో చెవిరెడ్డి కుమారుడి గెలుపు
ఎంపీటీసీలు మాత్రం కూటమికే ఎక్కువ!
తిరుపతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక చంద్రగిరి నియోజకవర్గంలో పాలక టీడీపీకి గట్టి షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడి తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం జడ్పీటీసీ స్థానాల్లో క్రాస్‌ఓటింగ్ కారణంగా టీడీపీ ఓడిపోయింది. వీటిలో తిరుపతి రూరల్ స్థానాన్ని కోల్పోడం ఆ పార్టీ వర్గాలకు మింగుడుపడడం లేదు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు హర్షిత్‌రెడ్డి పోటీ చేశారు. 563 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కారు. ఇక్కడ 85,092 ఓట్లకు గాను ఆయనకు 41,296, టీడీపీ అభ్యర్థిని ధనలక్ష్మికి 40,733 ఓట్లు లభించాయి.
అయితే ఎంపీటీసీల్లో అత్యధికం కూటమికే దక్కాయి. మొత్తం 40 మండలాలకు గాను టీడీపీకి 12 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 28 ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 15, జనసేనకు 2, బీజేపీకి ఒకటి లభించాయి. 9 చోట్ల మాత్రమే వైసీపీ నెగ్గింది. ఒక చోట ఇండిపెండెంట్ గెలిచారు. అంటే క్రాస్‌ఓటింగ్ భారీగా జరిగి హర్షిత్‌రెడ్డి గెలిచినట్లు స్పష్టమైంది. చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం జడ్పీటీసీల్లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ వైసీపీ గెలువగా.. ఎక్కువ ఎంపీటీసీలను మాత్రం కూటమి గెలుచుకుంది.
చిన్నగొట్టిగల్లు మండలంలో మొత్తం 7 ఎంపీటీసీలు ఉండగా.. 4 టీడీపీకి, 3 వైసీపీకి లభించాయి. ఎర్రావారిపాలెంలో 8 ఎంపీటీసీలకు గాను టీడీపీ 6, జనసేన 1 గెలిచాయి. వైసీపీ ఒక్కటి మాత్రమే గెలిచింది. అంటే ఈ రెండు మండలాల్లోనూ వైసీపీకి అనుకూలంగా క్రాస్‌ఓటింగ్ జరిగినట్లు అర్థమవుతోంది. ఈ నియోజకవర్గంలోని చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం జడ్పీటీసీ స్థానాల్లో మాత్రం టీడీపీ విజయం సాధించింది.
ఈ వార్తలనూ చదవండి: