నామినేషన్ల గడువు పొడిగించండి
ABN , Publish Date - Oct 20 , 2026 | 03:36 AM
పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల్లో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
నామినేషన్ల గడువు పొడిగించండి
ఏకగ్రీవాలు ప్రకటించకుండా స్టే విధించండి
మున్సి పోల్స్‌పై సుప్రీంకోర్టుకు వైసీపీ
న్యూఢిల్లీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల్లో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నామినేషన్లకు ఆటంకాలు సృష్టించారని తెలిపింది. తమ నేతలకు రక్షణ కల్పించడంతోపాటు నామినేషన్ల దాఖలుకు గడువు పొడిగించాలని, అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో నామినేషన్ల గడువును పెంచేందుకు నిరాకరిస్తూ, ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వైసీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గడువు ఇప్పటికే ముగిసిందని, ఈ దశలో జోక్యం చేసుకుంటే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందంటూ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేరుతో పిటిషన్ దాఖలైంది. పుంగనూరు, రాయచోటి, కడప, తిరుపతి ప్రాంతాల్లో నామినేషన్ల సందర్భంగా పలు సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కడపలో ఒక అభ్యర్థికి చెందిన నామినేషన్ పత్రాలను చింపివేశారని, తిరుపతి కార్పొరేషన్ పరిధిలో పోటీ చేయాల్సిన తొమ్మిది మంది వైసీపీ అభ్యర్థులను ఆయా ఆర్వో ఆఫీసుల్లోకి వెళ్లకుండా నిలిపివేశారని ఆరోపించారు. అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న ఎంపీ మిథున్ రెడ్డి వాహన శ్రేణిపై కూడా దాడికి పాల్పడ్డారని పిటిషన్లో ఆరోపించారు. పరిస్థితుల దృష్ట్యా జిల్లా కేంద్రాల్లో అదనపు నామినేషన్ సదుపాయాలు కల్పించాలని కోరుతూ అంతకుముందు వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ నెల 15న సింగిల్ బెంచ్ ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. వ్యక్తిగతంగా సంబంధిత అధికారులను ఆశ్రయించే వెసులుబాటు కల్పించింది.
తదనంతరం జరిగిన పరిణామాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. కేంద్రాల వద్ద భద్రత పెంచాలని స్పష్టం చేసిన ఎస్ఈసీ, గడువు పెంపునకు మాత్రం నిరాకరించిందని పిటిషన్లో ప్రస్తావించారు. పోటీ చేసే అవకాశాన్ని నిరోధించినప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియ పరిరక్షణకు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని పిటిషన్లో వెల్లడించింది. ఆటంకాల వల్ల నామినేషన్లు వేయలేకపోయిన వారికి పొడిగించిన సమయంలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ప్రక్రియపై ఉన్న న్యాయపరమైన నియంత్రణ కేవలం స్వచ్ఛంద సంయమనం కోసమేనని, అభ్యర్థులు పోటీ చేయకుండా నిరోధించినప్పుడు రాజ్యాంగబద్ధ కోర్టులు తగిన సూచనలు ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తుది ఆదేశాలు వచ్చే వరకు ప్రభావిత వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించకుండా స్టే విధించాలని వైసీపీ కోరింది. ఈ పిటిషన్‌ను న్యాయవాది (ఏఓఆర్) మహ్ఫూజ్ ఎ. నాజ్కి ద్వారా వైసీపీ సమర్పించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష
నేడు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు