Share News

వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్.. హైదరాబాద్‌ తరలింపు

ABN , Publish Date - Jun 05 , 2026 | 03:47 PM

నగరంలో గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో అతడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్.. హైదరాబాద్‌ తరలింపు
YCP Leader Bolla Brahmanaidu

హైదరాబాద్, జూన్05: నగరంలో గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో అతడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్ తీసుకువచ్చారు. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఈవోడబ్ల్యూ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో బొల్లా బ్రహ్మనాయుడును అరెస్ట్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. నకిలీ పత్రాల తయారీ, ఆర్థిక లావాదేవీలు, సంతకాల దుర్వినియోగంతోపాటు ఈ కేసులో ఇతర కుట్రదారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.


హైదరాబాద్‌ గండిపేటలో సర్వే నెం.18లోని సుమారు10 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు బ్రహ్మ నాయుడు కుట్రపన్నారు. అందుకోసం నకిలీ జీవోలు, తప్పుడు రెవెన్యూ రికార్డులు, నకిలీ ప్రభుత్వ పత్రాలు సృష్టించారు. ఈ విషయాన్ని గుర్తించిన తహసీల్దార్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం.990/2026గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న రాధాకృష్ణ, డ్రైవర్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.


బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ, నిమ్మల కుటుంబ సభ్యులు కలిసి ఈ కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ భూమి కబ్జా కోసం రూ.12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిమ్మల కుటుంబానికి రూ.4 కోట్లు, రాధాకృష్ణకు రూ.4 కోట్లు, ఇతరులకు మరో రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. నకిలీ పత్రాలు, ప్రభుత్వ అనుమతుల ద్వారా భూమిపై అక్రమ హక్కులు సృష్టించే ప్రయత్నం చేసినట్లు ఈ కేసు విచారణలో వెల్లడైంది.


అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం బ్రహ్మనాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో బ్రహ్మనాయుడు తీవ్ర నిరాశ చెందారు. మరో వైపు భూమి వ్యవహారంలో తనపై కేసు నమోదు కావడంతో బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. అతడి కోసం పోలీస్ బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు బ్రహ్మనాయుడు కాంచీపురంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. అతడిని అరెస్ట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టురట్టు.. ఒకరి అరెస్ట్

ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట మొక్క నాటాలి: ఏపీ డిప్యూటీ సీఎం
Read Latest TG News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 03:56 PM