గొడ్డలి పార్టీకి ఓటమి గుబులు
ABN , Publish Date - Sep 02 , 2026 | 03:20 AM
రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో కూటమి విజయం తథ్యమని సర్వే సంస్థలు నివేదికలిస్తున్నాయి.
గొడ్డలి పార్టీకి ఓటమి గుబులు
ఎన్నికలపై సర్వేలన్నీ కూటమికే అనుకూలం
అందుకే ‘స్థానికాన్ని’ అడ్డుకునే ప్రయత్నాలు
న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తున్నారు
బీసీ కోటా పెంపునూ వ్యతిరేకిస్తున్నారు
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే చాలదు
స్థానిక పాలన కూడా ఉండాలి
అందుకే ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్తున్నాం
ఎన్నికల్లో డబ్బు పంపకం ఆగిపోవాలి
ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి
పేదలుంటే ఆ గ్రామానికే అవమానం
మొగల్తూరు సభలో సీఎం వ్యాఖ్యలు
స్వయంగా సామాజిక పింఛన్ల పంపిణీ
స్థానిక సంస్థల్లో కూటమిదే విజయమంటూ సర్వే నివేదికలు వస్తున్నాయి. అందుకే గొడ్డలి పార్టీ భయపడుతోంది. ఓటమి గుబులుతోనే ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. ఏకగ్రీవం అయితే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనంటూ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బెదిరిస్తున్నారు. ఈ రోజున ఏకగ్రీవాలను ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. గ్రామ స్థాయిలో ఐక్యతకు ఏకగ్రీవాలు మంచి సాధనం. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటేనే సరిపోదు. స్థానిక పాలన కూడా ఉండాలి. అందుకే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికలను ప్రత్యక్షం చేశాం. ప్రజలు తమకు కావాల్సినవారిని నేరుగా ఎన్నుకోవచ్చు.
- సీఎం చంద్రబాబు
భీమవరం/మొగల్తూరు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో కూటమి విజయం తథ్యమని సర్వే సంస్థలు నివేదికలిస్తున్నాయి. దీంతో గొడ్డలి పార్టీకి వణుకు పుడుతోంది’’ అని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మంగళవారం జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ ప్రజా వేదికలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కార్యకర్తలు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ, జగన్‌ల వైఖరిని దుయ్యబట్టారు. ‘‘గొడ్డలి పార్టీ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీని నిర్వహించాం. దాన్ని అడ్డుకోవడానికి గొడ్డలి పార్టీ 356 కేసులు వేసింది. వాటిని పరిష్కరించాం. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. చదువుకున్న వాళ్లంతా తమ సామర్థ్యంతో ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు గొడ్డలి పార్టీ కోడి గుడ్డుపై ఈకలు పీకుతోంది. యువతకు టీచర్ ఉద్యోగాలిస్తే లేనిపోని ఆరోపణలు చేస్తోంది. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న ఉపాధ్యాయులు ఆ పార్టీపై తిరగబడ్డారు. కర్నూలు కొండారెడ్డి బురుజు ఎక్కి నినదించారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. విశాఖలో ఆందోళన చేపట్టారు. అన్యాయంగా అక్రమంగా ఉద్యోగాలు సాధించామని అవమానిస్తే బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ గొడ్డలి పార్టీని హెచ్చరించారు. దాంతో ఆ పార్టీ భయపడింది.’’ అని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
స్థానిక ఎన్నికలు జరగాల్సిందే...
‘‘మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్మన్లు/మేయర్లకు ప్రత్య క్ష ఎన్నికలు నిర్వహిస్తున్నాం. వివాదం లేకుండా ఐదేళ్ల పా టు చైర్మన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటేనే సరిపోదు. స్థానిక పాలన కూడా ఉండాలి. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూటమికి తిరుగులేదు. గొడ్డలి పార్టీ కుల, ప్రాంత, మత విద్వేషాలు రెచ్చగొడుతోంది. స్థాని క సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ను తగ్గించేసింది. మళ్లీ పెంచేందుకు మేం ప్రయత్నిస్తుంటే, కోర్టుకు వెళ్లారు. ఎన్నికలు అడ్డుకోవడమే గొడ్డలి పార్టీ ఆలోచన.’’
పేదలుంటే ఆ గ్రామానికే అవమానం
‘‘రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి. గ్రామాల్లో పేదలుంటే అభివృద్ధి జరిగినట్టు కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.3.50 లక్షల తలసరి ఆదాయం ఉంది. ఇది 2047 నాటికి రూ.54 లక్షలకు చేరుకుంటుంది. కానీ కనీస ఆదాయం లేని పేదలు అప్పుడు కూడా ఉండవచ్చు. అందుకే ఆర్థికంగా అందరూ ఎదగాలనే ఉద్దేశంతో ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామంలో ఇంకా పేదలుంటే అది గ్రామానికే అవమానం.’’
ఎన్నికల్లో డబ్బులిస్తే వద్దనండి..
‘ప్రభుత్వపరంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వృద్ధులకు రూ.4 వేలు పింఛన్ ఇస్తున్నాం. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బటన్ నొక్కి పెన్షన్ ఇచ్చేశామనుకునేవారు. ఇప్పుడు ప్రతీ ఇంటికి పెన్షన్ ఇస్తున్నాం. పింఛన్‌ను 4 వేలకు పెంచింది మేమే. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇప్పటి దాకా రూ.73,507 కోట్లు పెన్షన్ల రూపంలో ఇచ్చాం. సంక్షేమంలో భాగంగానే వడ్డెర్లకు మైనింగ్‌లో, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ ఇచ్చాం. చేనేత, మత్య్సకార కుటుంబాలకు ఏటా రూ.20 వేలిస్తున్నాం. ఇన్ని విధాలుగా సంక్షేమం చేస్తున్నా ఎన్నికల సమయంలో డబ్బులు తీసుకుంటున్నారు. కేవలం రూ.2 వేలు, వెయ్యి రూపాయల కోసం ఆశ పడితే ఎన్నికల్లో గెలిచిన వాడు డబ్బులు సంపాదించకుండా ఉంటాడా? అందుకే డబ్బులిస్తే వద్దని చెప్పండి. అప్పుడు అవినీతి లేని పాలన వస్తుంది’’
మహిళలే మహరాణులు
‘‘ఇంట్లో ఆడ పిల్ల ఉంటే వయసు రాగానే పెళ్లి చేసేద్దామంటూ తల్లిదండ్రులు భావించేవారు. ఇప్పుడు చదివించాలనే తపన పెరిగింది. వారు ఉద్యోగాలకు వెళ్లాలని ఉచిత బస్సు అమలు చేస్తున్నాం. మహిళలు బస్సు డ్రైవర్లుగా రాలేదు. ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి. అప్పుడైనా మహిళలు డ్రెవర్‌లుగా రావాలని ఆకాంక్షిస్తున్నాం. ఏసీ బస్సులలోనూ ఉచిత ప్రయాణం కల్పిస్తాం’’.
నదుల సంధానంతో సస్యశ్యామలం
‘రెండేళ్లలో రూ.22 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరువు నేలకు నీరు ఇచ్చాం. నల్లమల కొం డల్లో సొరంగాలు తవ్వి నీరు పారించడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. గోదావరి నీటిని ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి తీసుకువెళ్లి అక్కడ చరిత్ర మారుస్తున్నాం. వచ్చే ఏడాది విశాఖకు గోదావరి నీరు వెళుతుంది. తర్వాత వంశధారతో అనుసంధానం చేస్తాం. గోదావరి, కృష్ణా, వంశధారలను అనుసంధానం చేయడమే లక్ష్యం.
ఇదే రోజు తొలిసారి సీఎంగా ప్రమాణం
‘‘31 ఏళ్ల క్రితం సెప్టెంబరు 1న ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారి ప్రమాణం చేశా. అనేక సంస్కరణలకు నాంది పలికాను. గత ప్రభుత్వంలో రాష్ట్రం ధ్వంసమైంది. పున ర్నిర్మాణానికి ప్రజలంతా ఎన్డీఏని ఏకపక్షంగా గెలిపించారు. విధ్వంసాన్ని అధిగమించి సమస్యలను చక్కదిద్దేందుకు రెండేళ్లు పట్టింది. అయినా గొడ్డలి పార్టీ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది’’ అని తెలిపారు.
ఈ వార్తలను కూడా చదవండి
సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని