Share News

అన్నా.. ఎందుకీ దిగజారుడు?

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:30 AM

‘‘తల్లి, చెల్లి అనే భేదం లేకుండా బురద రాతలు రాయించడమేనా మీ అజెండా? ఇవి మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా?’’ అని తన అన్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.

అన్నా.. ఎందుకీ దిగజారుడు?

  • తల్లీ చెల్లీ తేడా తెలియని జంతు చేష్టలు!

  • మీకూ, మీ సైతాన్‌ సైన్యానికి పచ్చరోగం

  • తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్‌, సత్సంబంధాలుఅని రోత రాతలు రాస్తారా?

  • ఆడబిడ్డపై ఇలాంటి నిందలు వేస్తారా?

  • మీ మానసిక స్థితి మెరుగుపడలేదు

  • ఆ రాతలు మీరే దగ్గరుండి రాయించారా?

  • జగన్‌పై, ఆయన పత్రికపై షర్మిల ధ్వజం

అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘తల్లి, చెల్లి అనే భేదం లేకుండా బురద రాతలు రాయించడమేనా మీ అజెండా? ఇవి మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా?’’ అని తన అన్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలిసి ఆహ్వానించడాన్ని జగన్‌ పత్రిక రాజకీయ కోణంలో చూస్తూ... చెట్టాపట్టాల్‌, సత్సంబంధాలు అంటూ కలుషిత రాతలు రాయడమేమిటని నిలదీశారు. దీనిపై మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా సుదీర్ఘప్రకటన విడుదల చేశారు. అందులో షర్మిల ఏమన్నారంటే..

‘‘తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్‌ అంటారా? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా? ఇది వావివరసలు తెలిసినోడు చేసేపనేనా? విలువలున్నోడు రాసే రాతలేనా? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా? నాపై నేడు సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది వైసీపీ అండ్‌ కో నీచపు బుద్ధికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లీ చెల్లీ అనే తేడాలేకుండా చేసే జంతు చేష్టలకు పరాకాష్ఠ. జగన్‌ గారికి, తన సైతాన్‌ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు.


వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కోణమని, చెట్టాపట్టాల్‌ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్థాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవ సంబంధాలు మరిచిపోయి రాక్షసతత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్రప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.

ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబుగారిని వైఎస్ఆర్ గారు ఆహ్వానించారు. అంటే, ఆయన కూడా చంద్రబాబుగారితో చెట్టాపట్టాల్‌ వేసుకొని తిరిగినట్లా? జగన్మోహన్‌రెడ్డిని అడుగుతున్నాం. అక్క చెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్‌ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాపనిందలు వేయడమా మీ పత్రిక విధానం? తల్లి, చెల్లి అనే భేదం లేకుండా బురద రాతలు రాయించడమా మీ అజెండా? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా? సమాధానం చెప్పాలి. నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందుకు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా? తేల్చుకోవాలి.’’

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 03:39 AM