జగన్ అడ్డాలో వైసీపీ అరాచకం!
ABN , Publish Date - Oct 18 , 2026 | 03:08 AM
మాజీ సీఎం జగన్ సొంత గడ్డ పులివెందులలో వైసీపీ రెచ్చిపోయింది. టీడీపీ నామినేషన్లను అడ్డుకోవడానికి విఫలయత్నం చేసింది. పోలీసులపైనే దాడులకు తెగబడి గూండాగిరి ప్రదర్శించింది.
టీడీపీ నామినేషన్లను అడ్డుకునేందుకు యత్నం
అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది దండయాత్ర
పోలీసులపై రాళ్లు, బీరు బాటిళ్లతో దాడి
కడప ఎస్పీ విశ్వనాథ్పైకీ రాళ్లు
20 రౌండ్లు గాలిలోకి పోలీసుల కాల్పులు
బాష్పవాయువు ప్రయోగం
రెండున్నర గంటల పాటు రచ్చరచ్చ
కడప, రాజంపేట, బద్వేలులోనూ అదే తీరు
రాళ్లు, కారంపొడితో కవ్వింపు దాడులు
కడప, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ సొంత గడ్డ పులివెందులలో వైసీపీ రెచ్చిపోయింది. టీడీపీ నామినేషన్లను అడ్డుకోవడానికి విఫలయత్నం చేసింది. పోలీసులపైనే దాడులకు తెగబడి గూండాగిరి ప్రదర్శించింది. ఇన్నాళ్లూ ఏకపక్షంగా సాగిన పులివెందుల బరిలో తొలిసారిగా టీడీపీ నుంచి బలమైన పోటీ కనిపిస్తుండటంతో జీర్ణించుకోలేకపోయింది. సాక్షాత్తూ కడప జిల్లా ఎస్పీపైనే రాళ్లు, బీరు బాటిళ్లతో దాడులు జరిగాయి. పోలీసులు 20 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినా పరిస్థితి అదుపులోకి రాలేదు. కడప, రాజంపేట, బద్వేలులోనూ అదే స్థాయిలో అరాచకానికి పాల్పడ్డారు. పులివెందుల మున్సిపాలిటీలో 40 వార్డులు ఉన్నాయి. వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా జగన్ చిన్నమ్మ (అవినాశ్‌రెడ్డి బాబాయి వైఎస్ మనోహర్‌రెడ్డి భార్య) వైఎస్ ప్రమీలను ప్రకటించారు. శుక్రవారం తొలిరోజు ఆమెతో పాటు 26 మంది వైసీపీ వార్డు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
టీడీపీ వారు రెండో రోజు శనివారం నామినేషన్లు వేసేందుకు తమ అభ్యర్థులతో వచ్చారు. తూగుట్ల గీతాకుమారి నామినేషన్ వేస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. ఇది తెలిసి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మంది వైసీపీ కార్యకర్తలు మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్నారు. ఇరు వర్గాలూ ఎదురుపడితే గొడవ జరుగుతుందని భావించి పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోపల టీడీపీ నేతలు నామినేషన్లు వేస్తున్నారని.. వారు వెళ్లాక వచ్చి నామినేషన్లు వేసుకోవాలని సూచించారు. ‘మా అడ్డాలో టీడీపీ వాళ్లు ఉంటే మేం వెళ్లకూడదా? మేమూ నామినేషన్లు వేయాలి’ అంటూ కార్యాలయంలోకి చొరబడేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ శ్రేణులు కట్టెలు, బీరు బాటిళ్లు, రాళ్లతో వారిపైకి దూసుకొచ్చారు. ఎంత నచ్చజెప్పినా వినలేదు. పోలీసులపైనే రాళ్లు రువ్వారు. బీరు బాటిళ్లు విసిరారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాలిలోకి 20 రౌండ్లు కాల్పులు జరిపారు. బాష్పవాయువు ప్రయోగించారు. అయినా వైసీపీ దాడులు కొనసాగడంతో.. కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అక్కడకు చేరుకున్నారు. ఆయనపైనా రాళ్లు, బీరు బాటిళ్లు విసిరారు. పోలీసులు ఎస్పీకి రక్షణగా నిలిచారు. సుమారు రెండున్నర గంటల పాటు వైసీపీ అరాచకం సాగింది. చివరకు.. అక్కడినుంచి వెళ్లకుంటే అరెస్టు ఖాయమని ఎస్పీ హెచ్చరించడంతో.. ఎట్టకేలకు వైసీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. ఇదే సమయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులు నిలువరించగలిగారు. రెండు పార్టీలూ బాహాబాహీకి దిగి ఉంటే పెద్దఎత్తున విధ్వంసంతో పాటు ప్రాణనష్టం జరిగి ఉండేదని అంటున్నారు. ఈ సమరం పోలీసులు వర్సెస్ వైసీపీలా మారింది.
కడపలో కారం దాడి..
కడప నగరంలోనూ వైసీపీ బ్యాచ్ దాడులకు దిగింది. ఇక్కడ గాంధీనగర్ స్కూల్లో నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఉదయాన్నే వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కారంపొడితో కవ్వింపు చర్యలకు దిగారు. వారి దాడుల్లో మూడు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. మధ్యాహ్నం వరకు రణరంగంగా సాగింది. ఎర్రముక్కపల్లె సర్కిల్ సమీపంలో టీడీపీ నేత మైసూరారెడ్డికి చెందిన కారును ఉదయం రాళ్లతో ధ్వంసం చేశారు. దీనిపై ఆయన వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. ధ్వంసమైన చోటే కారును ఉంచేశారు. అయితే రాత్రి అదే కారుపై కొంతమంది పెట్రోలు పోసి నిప్పంటించారు.
తన కారును వైసీపీ నేతలు నిత్యానందరెడ్డి, గుంటి నాగేంద్ర, ఐస్‌క్రీం రవి, మాజీ కార్పొరేటరు లక్షుమయ్య మరికొందరు కాల్చారంటూ మైసూరారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక కడపలోనే కాగితాలపెంటలోనూ దాడులు, ప్రతిదాడులు జరిగాయి. అక్కడ వైసీపీకి చెందిన ఎం.బాషాకు కత్తిపోట్లు పడ్డాయి. ఆదివారం నామినేషన్లకు చివరిరోజు. దీంతో పులివెందుల, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుంచి తన కార్యకర్తలను వైసీపీ తరలిస్తున్నట్లు సమాచారం.
ఇంకోవైపు.. రాజంపేటలోని నామినేషన్ కేంద్రానికి వైసీపీ శ్రేణులు రాళ్లతో, కారంపొడితో వచ్చారు. టీడీపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి వాహనంపైనా దాడిచేశారు. బద్వేలులో 14వ వార్డులో డివిజన్ టీడీపీ అభ్యర్థిగా షేక్ మహబూబ్ బాషా నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను చింపేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కొందరి నామినేషన్ పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు.
ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నా..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో 144 సెక్షన్ అమల్లో ఉందని.. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు ఎంపీ అవినాశ్‌రెడ్డికి స్పష్టంచేశారు. పులివెందుల అర్బన్ సీఐ పురుషోత్తరాజు ఈ మేరకు ఆయనకు నోటీసులిచ్చారు. అయితే ఈ నోటీసులను లెక్కచేయకుండా అవినాశ్‌రెడ్డి వైసీపీ మూకతో మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. వైసీపీ కార్యకర్తలు పోలీసులపై దాడులు సాగిస్తున్న సమయంలో ఆయన వారితోనే ఉండడం గమనార్హం.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ