నా కుమార్తెను వేధిస్తున్నాడు...
ABN , Publish Date - Feb 03 , 2026 | 10:29 AM
డిసెంబరు 23 నుంచి తన కుమార్తె ఆచూకీ తెలియలేదని గుంటూరుకు చెందిన ఓ మహిళ.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే.. భర్త రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- మహిళా కమిషన్‌కు ఫిర్యాదుతో మోహన్‌రెడ్డి కాలనీలో ఛైర్‌పర్సన్ శైలజ విచారణ
చంద్రగిరి(తిరుపతి): తన కుమార్తె సుష్మను ఆమె భర్త మోహన్ రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నాడని, డిసెంబరు 23 నుంచి తన కుమార్తె ఆచూకీ తెలియలేదని గుంటూరు(Guntur)కు చెందిన ఝాన్సీవాణి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ సోమవారం తన బృందంతో చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లె పంచాయతీలోని మోహన్‌రెడ్డి కాలనీకి వచ్చారు. గుంటూరుకు చెందిన సుష్మ, శ్రీనివాసమంగాపురానికి చెందిన మోహన్ మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొని మోహన్‌రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు.
అయితే గత సంవత్సరం డిసెంబరు 23న రాత్రి 9 గంటల సమయంలో సుష్మ తన సమీప ఇంటి నుంచి ఫోన్ చేసి, తన భర్త మోహన్ తనను రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నాడని, ఇంట్లో పెట్టి నిర్బంధిస్తున్నాడని చెప్పిందని, తరువాత కూతురి జాడ తెలియలేదంది. దీంతో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ సోమవారం మోహన్‌రెడ్డి కాలనీకి చేరుకుని సుష్మ సమీప ఇంట్లో వారిని విచారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సుష్మా ఎప్పడూ బయటకు వచ్చేది కాదని, డిసెంబరు 23 రాత్రి 9 గంటల సమయంలో తమ ఇంటి ముందుకు వచ్చి తన తల్లి ఝాన్సీవాణి బాత్రూంలో కాలు జారి పడిందని, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలేస్తే గుంటూరుకు వెళ్తానని చెప్పిందన్నారు. అయితే ఆ సమయంలో సుష్మను ఆమె భర్తకు తెలియకుండా తిరుపతిలో వదలడం భావ్యం కాదని,
మోహన్ వచ్చాక చెప్పి వెళ్ళమని సర్దిచెప్పడంతో ఇంటికి వెళ్లి పోయిందన్నారు. కొద్ది రోజుల క్రితం మోహన్, సుష్మా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. అనంతరం సుష్మా భర్త మోహన్ సెల్‌ఫోన్ నెంబర్ తెలుసుకుని చంద్రగిరి ఎస్‌ఐ రవిప్రకా్‌షరెడ్డి ఫోన్ చేశారన్నారు. మోహన్ తన భార్య సుష్మాతో ఎస్‌ఐకి వీడియో కాల్ చేశారన్నారు. తన భర్త వేధించడం లేదని, కావాలనే తన తల్లితండ్రులు తనను తన భర్త నుంచి వేరు చేయాలని చూస్తున్నారంటూ సుష్మ ఎస్‌ఐకి చెప్పింది. అయితే సుష్మ, మోహన్ ఎక్కడ ఉన్నారనే విషయం పోలీసులకు చెప్పలేదు. దీనిపై సుష్మ తల్లి ఝాన్సీవాణి మాట్లాడుతూ...
తన కుమార్తెను రెండు సంవత్సరాలుగా మోహన్ వేధిస్తున్నాడని, తనతో అనేక సార్లు వాట్సప్ చాటింగ్ చేసి, డబ్బులు పంపించమని తన కుమార్తె ద్వారా అడిగించారని, ఇప్పటి వరకు సుమారు రూ.30 లక్షల దాకా ఫోన్‌పే ద్వారా పంపామని తెలిపారు. తన కుమార్తె సుష్మను మోహన్ పక్కనుంచి బెదిరించడంతోనే వీడియో కాల్‌లో తమపై ఆరోపణలు చేసిందన్నారు.సుష్మ, మోహన్‌ను వ్యక్తిగతంగా విచారించి తన కుమార్తెకు మహిళా కమిషన్ ద్వారా న్యాయం చేయాలని ఆమె కోరారు.మహిళా కమిషన్ మెంబర్ రుఖియాబాయి, డీఎంసీ కృష్ణమంజరి, పీడీ వసంతబాయి, సీడీపీవో ప్రదీప, సూపర్‌వైజర్ ధన తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు
Read Latest Telangana News and National News