Share News

సముద్రంలో గల్లంతైన 7 మంది మత్స్యకారులు.. ముమ్మరంగా గాలింపు

ABN , Publish Date - Aug 19 , 2026 | 07:02 PM

సముద్రంలో గల్లంతైన కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పారాదీప్‌కు 15 నాటికల్ మైళ్ల దూరంలో ‘ముత్యాలమ్మ’ పేరుతో ఉన్న పసుపు రంగు బోటును అధికారులు గుర్తించారు.

సముద్రంలో గల్లంతైన 7 మంది మత్స్యకారులు.. ముమ్మరంగా గాలింపు
Konaseema Fishermen Missing

కోనసీమ: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పారాదీప్‌కు సుమారు 15 నాటికల్ మైళ్ల దూరంలో ‘ముత్యాలమ్మ’ పేరుతో ఉన్న పసుపు రంగు బోటును అధికారులు గుర్తించారు. ఈ బోటు గల్లంతైన మత్స్యకారులు వెళ్లిన బోటేనా? అనే విషయాన్ని ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి. ఆగస్టు 3న కోనసీమ జిల్లా ఓడలరేవు ఫిషింగ్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నుంచి IND-AP-E8-MO-135 ‘ముత్యాలమ్మ’ బోటులో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అనంతరం వారు గల్లంతయ్యారు. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.


సుమారు 300 నాటికల్‌ మైళ్ల పరిధిలో గాలింపు కొనసాగుతోంది. కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఐదు నౌకలు, నేవీకి చెందిన రెండు నౌకలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. అలాగే నేవీకి చెందిన రెండు అత్యాధునిక విమానాలతోనూ సముద్రంలో గాలిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, అసోం తీర ప్రాంత రక్షణ విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నారు. మరోవైపు, గల్లంతైన బోటులో సుమారు 1,000 లీటర్ల డీజిల్‌, 20 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సముద్ర వాతావరణం అనుకూలంగా ఉండటంతో మత్స్యకారులు క్షేమంగా ఉండే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Also Read:

వైసీపీ హయాంలో.. గ్రూప్‌-1 పరీక్షల్లో భారీ అక్రమాలు: సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు అన్ని సౌకర్యాలు కల్పించారు: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు

Updated Date - Aug 19 , 2026 | 07:02 PM