Share News

మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. చరిత్ర సృష్టిస్తాం

ABN , Publish Date - Sep 09 , 2026 | 03:58 AM

మూడేళ్లలో రూ.35వేల కోట్లతో రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌ రెండో రోజున ఆయన మాట్లాడారు.

మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. చరిత్ర సృష్టిస్తాం

  • వెలిగొండలో ఈ సీజన్‌లో 10.7 టీఎంసీల నిల్వ

  • ఎల్‌నినో ప్రభావం ఉన్నా 1000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోంది

  • అందులో 300 టీఎంసీలు వాడుకున్నా అద్భుతాలు సాధ్యం

  • ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం.. కాంక్లేవ్‌లో సీఎం

  • చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు

  • నేడు రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ పేరిట దీపాల ప్రదర్శన

అమరావతి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మూడేళ్లలో రూ.35వేల కోట్లతో రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం టీడీపీ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌ రెండో రోజున ఆయన మాట్లాడారు. ‘‘వంశధార, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, కావేరి, పెన్నా నదులు అనుసంధానమైతే రిజర్వాయర్లన్నీ నింపుకోవచ్చు. వెలిగొండలో ఈ సీజన్‌లో 10.7 టీఎంసీలు నిల్వ చేసుకుంటున్నాం. వచ్చే ఏడాది 50 టీఎంసీలు నిల్వ చేస్తాం. పోలవరంలో ఫేజ్‌-2 పూర్తితో 190 టీఎంసీల వరకు నిల్వ చేసుకోవచ్చు. బొల్లాపల్లి నిర్మిస్తే 350 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. కడప జిల్లాలోని ప్రాజెక్టులతో సుమారు 100 టీఎంసీలు నింపుకొనే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలున్నాయి. అన్నీ పూర్తిచేసుకుంటే రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో 1,250 నుంచి 1,400 టీఎంసీలు నిల్వ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. నీళ్లు బయట నుంచి నదుల గుండా రావడం ఎంత ముఖ్యమో, మన ప్రాంతంలో కురిసిన వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం కూడా అంతే ముఖ్యం. భూగర్భ జలాలు పెరిగితే, విద్యుత్తుకు పెట్టే సబ్సిడీ వ్యయం కూడా తగ్గించవచ్చు. ట్రాన్స్‌మిషన్‌ ఖర్చులు కూడా తగ్గుతాయి.’’ అని సీఎం తెలిపారు. ‘రాష్ట్ర స్థూల అభివృద్ధితో నియోజకవర్గ స్థాయి అభివృద్ధి అనుసంధానం కావాలని కోరారు.


‘‘నియోజకవర్గ జీడీపీలో విజయవాడ సెంట్రల్‌, పాలకొల్లు, మండపేట, చిలకలూరిపేట, నెల్లూ రు సిటీ, తణుకు ముందున్నాయి. అభివృద్ధిపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా నాయకుల ప్రచార శైలి ఉండాలి. విమర్శలను కూడా సానుకూలంగా మార్చుకుని ప్రజల మద్దతు కూడగట్టాలి. మనం చేస్తున్న అభివృద్ధితో ఓటుబ్యాంకు పెంచుకుందాం. డేటా సెంటర్లకు కావాల్సిన ఐదు టీఎంసీల నీరు అసలు సమస్యే కాదు. పోలవరం ఎడమకాలువ ద్వారా రోజుకు 2 టీఎంసీలు తీసుకెళ్లే అవకాశం ఉంది. డేటా సెంటర్ల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉంది. 15-20 రంగాల్లో జీఎస్డీపీని పెంచేలా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ గోదావరి నుంచి ఈ ఏడాది 1000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్లింది. అందులోంచి 300 టీఎంసీలు వాడుకున్నా అద్భుతాలు సృష్టించవచ్చు.’’ అని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

రాష్ట్రవ్యాప్తంగా సక్సెస్‌ స్టోరీలు రావాలి..

‘‘సంపద సృష్టికి డబ్బులు లేవని కూర్చుంటే సరిపోదు. ఆలోచన చేస్తే పరిష్కారం లభిస్తుంది. రాష్ట్రాన్ని దేశంలో నం.1గా అభివృద్ధి చేయడమే లక్ష్యం. ఆలోచన మారితే ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేసుకోవచ్చు. కుప్పం సమీపం నుంచి వెళ్తున్న జాతీయ రహదారికి దగ్గర్లో ఓ పారిశ్రామిక ప్రాంతాన్ని సృష్టించాం. రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌తో ప్రాజెక్టులు అంతే వేగంగా ఏర్పాటయ్యేలా చూడాలి. ‘పౌరసేవలు అందించడంలో కొన్ని నియోజకవర్గాలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. అన్ని నియోజకవర్గాలూ ఉత్తమ కార్యాచరణ పద్ధతులను అమలు చేయాలి. ఏడాదికి రూ.1000 కోట్ల ఆదాయం వస్తున్నా వదులుకుని, ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తున్నాం. ఎక్కడైనా ఉచిత ఇసుక ఇతర రాష్ర్టాలకు వెళ్తే అడ్డుకోండి..’’


ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం..

‘‘ఎల్‌నినో వల్ల రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అంతా కలిసి దీనిని సమర్థంగా ఎదుర్కోందాం. రాష్ట్రంలో ఇప్పటిదాకా 54 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లలో గత ఏడాది ఇదే సమయానికి 737 టీఎంసీల నీరు ఉంటే.. ఈసారి మాత్రం 530 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. భూగర్భ జలాలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వేయాల్సిన దానికంటే ఎక్కువగా పంటలు వేశారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 177 శాతం పంటలు వేశారు. తిరుపతి జిల్లాలో 158 శాతం, కోనసీమలో 103 శాతం, పశ్చిమ గోదావరిలో 99 శాతం పంటలు వేశారు. మార్కాపురంలో 21, పోలవరంలో 20, ప్రకాశం జిల్లాలో 12 శాతం మాత్రమే పంటలు వేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు కూడా పెద్ద ఎత్తునే సాగు చేశారు. గోదావరి నీటిని తరలించి కృష్ణా డెల్టాలో పంటలను కాపాడుకోగలిగాం. పట్టిసీమ ద్వారా 36 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీకి తరలించాం. ఈ సీజన్‌లో ఈ ప్రాంతానికి మరో 71 టీఎంసీలు అవసరం. సంక్షోభం దృష్ట్యా తాగునీటికే మొదటి ప్రాధాన్యం. పశువులకు కూడా నీటి కొరత లేకుండా కాపాడుకుంటాం. పరిశ్రమలకు లోటు లేకుండా కార్యాచరణ చేపడతాం. ఉద్యాన పంటలూ కాపాడుకునేలా చర్యలు చేపట్టాం. పంటల బీమా పెద్దఎత్తున చేశాం. వర్షాభావంతో కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల్లోని రైతులు పూర్తిగా నష్టపోయారు. వైవిధ్య పంటల దిశగా అవగాహన కల్పించాలి. రాష్ట్రంలో ప్రతి ఎకరంలో సాగు చేసేందుకు పీఎండీఎస్‌ విధానం చేపట్టాలి. 32 రకాల విత్తనాలను పీఎండీఎస్‌ ద్వారా సాగు చేసేందుకు ఆస్కారం ఉంది. 25 లక్షల ఎకరాల్లో ఈ తరహా విధానం అనుసరించాలని రైతులకు పిలుపునిస్తున్నా. వివిధ నియోజకవర్గాల్లో పీఎండీఎస్‌ విధానంలో విత్తనాలను చల్లించాలని కోరుతున్నా. గత పాలకులు సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలోకి వాస్తవాలను తీసుకెళ్లి కౌంటర్‌ చేయాలి. ప్రజల్లో విశ్వాసం కల్పించేలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్‌చార్జి మంత్రులు నిరంతరం మాట్లాడాలి. సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ ఎల్‌నినోపైనే కేంద్రీకరించాలి’’ అని సీఎం పిలుపునిచ్చారు.


  • చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు

నేడు రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ పేరిట దీపాల ప్రదర్శన

టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేసి బుధవారంతో మూడేళ్లు పూర్తి అవుతాయని మంత్రి లోకేశ్‌ తెలిపారు. ‘‘అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్‌ చేసి రోడ్డు మార్గంలో ఆయనను నాడు కోర్టుకు తీసుకెళ్లారు. 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో బంధించారు. ఆయనకు కోర్టు, ఈడీ క్లీన్‌ చిట్‌ ఇచ్చాయి. రేపు ‘నిజం గెలిచింది’ పేరుతో పార్టీ కార్యాలయాలు, ఇళ్లు, బూత్‌ లెవల్‌ లో 53 దీపాలు వెలిగిద్దాం. చంద్రబాబు అక్రమ అరెస్టును బ్లాక్‌ డే గా పాటిద్దాం.’’ అని వెల్లడించారు.

ముగిసిన టీడీపీ కాంక్లేవ్‌

టీడీపీ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌ ముగిసింది. రెండో రోజు సమావేశంలో ఐదు అంశాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌ అంశంపై ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు బొండా ఉమ, కూన రవికుమార్‌ .. ప్రభుత్వ సేవలు, పాలనా విధానంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, మంత్రి అనగాని సత్యప్రసాద్‌, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.. నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకు చేరడం, నాయకుడి ఎదుగుదలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ.. పీ4పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. రాజకీయ ప్రచారం, ప్రజా సంబంధాలు అనే అంశంపై మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎల్‌నినోను సమర్ధంగా ఎదుర్కోవడంపై మంత్రి అనిత మాట్లాడారు.


ఇమేజ్‌ పెంచుకోండి

‘‘నియోజకవర్గాల్లో దీర్ఘకాలిక సమస్యలను స్వయంగా చొరవ తీసుకుని పరిష్కరించాలి. దానివల్ల ఎమ్మెల్యేలకు ఇమేజ్‌ పెరుగుతుంది. నివాసం ఉంటూ, అభ్యంతరాల్లేని చోట ఇళ్ల పట్టాలు అందించి క్రమబద్ధీకరిస్తాం. ఓ నాయకుడు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ప్రజలకు దగ్గరవ్వాలి. కనీసం వాయిస్‌ మెసేజ్‌ ద్వారా ఆయినా చేరువ కావాలి. ప్రజల సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే వారిలో సానుకూల దృక్పథం కలుగుతుంది. ఆర్టీజీఎస్‌ ద్వారా పబ్లిక్‌ గ్రీవెన్సులను పూర్తిస్థాయిలో పరిష్కరించేలా చూడాలి. రూఫ్‌ టాప్‌ సోలార్‌పై అంతా దృష్టి పెట్టాలి. ల్యాండ్‌ రికార్డులన్నీ 2027 మార్చి నాటికి ప్రక్షాళనైతే, భూ వివాదాలు ముగిసిపోతాయి. రియల్‌ టైమ్‌ నిర్ణయాలతో జెన్‌జీ దూకుడు ప్రదర్శిస్తోంది. జెన్‌జీ ఆలోచనల్ని కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. గత సమావేశంలో నియోజకవర్గాల్లో పరిష్కరించాల్సిన అంశాలను ఎమ్మెల్యేలు లేవనెత్తారు. వీటిపై సమీక్షించి 175 నియోజకవర్గాల్లో రూ.20,400 కోట్ల విలువైన 616 పనులను మంజూరు చేశాం.’’

ఈ వార్తలనూ చదవండి...

పడక గది ప్రశాంతంగా...

బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..

Updated Date - Sep 09 , 2026 | 03:58 AM