Share News

ముమ్మరంగా కొనసాగుతున్న ఆపరేషన్ గజ..

ABN , Publish Date - Aug 08 , 2026 | 07:19 PM

విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు సంచారంతో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు అటవీశాఖ ‘ఆపరేషన్‌ గజ’ను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రంగంలోకి దించింది.

ముమ్మరంగా కొనసాగుతున్న ఆపరేషన్ గజ..
Kumki Elephants

విజయనగరం: జిల్లాలో ఏనుగుల గుంపు సంచారంతో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు అటవీశాఖ ‘ఆపరేషన్‌ గజ’ను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రంగంలోకి దించింది. బొబ్బిలి మండలం రాముడువలస పొలిమేరలో తిష్టవేసిన గజరాజుల గుంపును కట్టడి చేసేందుకు అభిమన్యు, జయంతి అనే కుంకీ ఏనుగులను అధికారులు అక్కడికి తరలించారు.


ఇప్పటికే అటవీ ఏనుగులను కట్టడి చేసేలా ప్రత్యేక శిక్షణ పొందిన ఈ గజరాజులను అటవీ ఏనుగుల గుంపుతో మమేకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిమన్యు, జయంతి కుంకీ ఏనుగులను అటవీ ఏనుగుల గుంపునకు దగ్గరగా తీసుకెళ్లి వాటి ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. కుంకీలకు స్థానిక గజరాజులు అలవాటు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా గుంపును తరిమివేయడం కాకుండా వాటి కదలికలను నిశితంగా పరిశీలిస్తూ, కుంకీ ఏనుగుల సహాయంతో వాటిని నియంత్రించే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు.


ఏనుగుల గుంపు పంట పొలాల్లోకి ప్రవేశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాత్రివేళల్లో వాటి సంచారంతో గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో కుంకీ ఏనుగులను రంగంలోకి దించడం ద్వారా గజరాజుల కదలికలను నియంత్రించవచ్చని అధికారులు భావించారు. ఈ మేరకు అటవీ ఏనుగుల గుంపుతో కుంకీలు మమేకం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని డీఎఫ్‌ఓ ప్రసన్న తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని సూచించారు.


వార్తలు కూడా చదవండి...

జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు

Updated Date - Aug 08 , 2026 | 07:22 PM