Share News

భోగాపురం విమానాశ్రయానికి గుడ్ న్యూస్.. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్..

ABN , Publish Date - Jul 13 , 2026 | 08:18 PM

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 'ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025' పరిధిలోకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుని తీసుకొచ్చింది.

భోగాపురం విమానాశ్రయానికి గుడ్ న్యూస్.. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్..
Bhogapuram International Airport

న్యూఢిల్లీ: ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 'ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025' పరిధిలోకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుని తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారిక గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భోగాపురం నుంచి నేరుగా అంతర్జాతీయ విమానాల రాకపోకలకు చట్టపరమైన మార్గం సుగమమైంది.


కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల ప్రకారం కేటగిరీ-1 విమానాశ్రయాల జాబితాలో భోగాపురం 39వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ గుర్తింపుతో విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్, విదేశీయుల ప్రవేశ, నిష్క్రమణకు సంబంధించిన అన్ని ప్రక్రియలను అధికారికంగా నిర్వహించే అవకాశం కలిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సులభం కానున్నాయి. అలాగే పర్యాటకం, ఐటీ, పారిశ్రామిక రంగాలతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ ఈ నిర్ణయం కీలక పాత్ర పోషించనుందని అధికారులు భావిస్తున్నారు.


ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ప్రధాన కేంద్రంగా మారనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఆ ప్రాంత అభివృద్ధికి మరో మైలురాయిగా నిలవనుంది. విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో పాటు వాణిజ్య, ఉపాధి అవకాశాలూ గణనీయంగా విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, తాజా ఉత్తర్వులు హోంశాఖ అదనపు కార్యదర్శి నితేశ్ కుమార్ వ్యాస్ పేరిట జారీ అయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు

సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట

Updated Date - Jul 13 , 2026 | 08:30 PM