Share News

ఉపాధ్యాయ ఉద్యోగాల సృష్టికర్త చంద్రబాబే.. బొత్స వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: మంత్రి శ్రీనివాస్

ABN , Publish Date - Jul 27 , 2026 | 06:10 PM

పూర్తి అవాస్తవాలతో ప్రభుత్వన్ని బద్నాం చేసేలా.. యువతలో అపోహలు సృష్టించేందుకు గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తోందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 9 సార్లు డీఎస్సీ నిర్వహించి..1.80 లక్షలకుపైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు సృష్టించారని గుర్తు చేశారు.

ఉపాధ్యాయ ఉద్యోగాల సృష్టికర్త చంద్రబాబే.. బొత్స వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: మంత్రి శ్రీనివాస్
AP Minister Kondapalli Srinivas

విజయనగరం, జులై 27: పూర్తి అవాస్తవాలతో ప్రభుత్వన్ని బద్నాం చేసేలా.. యువతలో అపోహలు సృష్టించేందుకు గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తోందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 9 సార్లు డీఎస్సీ నిర్వహించి..1.80 లక్షలకుపైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు సృష్టించారని గుర్తు చేశారు. సోమవారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంధ్రలోనూ, నవ్యాంధ్రలోనూ ఉపాధ్యాయ ఉద్యోగాల సృష్టికర్త అంటే ముందుగా గుర్తొచ్చే పేరు చంద్రబాబేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మెగా డీఎస్సీపై తొలి సంతకం పెట్టి 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసి మాట నిలబెట్టుకుందని అన్నారు.


డీఎస్సీపై వైసీపీ ప్రభుత్వం 230కి పైగా కేసులు వేసినా.. ప్రభుత్వం జవాబు పత్రాలు, ఫలితాలు, ఎంపిక అన్ని విషయాలు ఆన్‌లైన్‌లో పొందుపరిచి.. తద్వారా పారదర్శకతను నిరూపించుకుందని వివరించారు. గత ప్రభుత్వంలో 8 వేల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పి.. ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులు, యువతను మోసం చేసిందంటూ వైసీపీపై మంత్రి కొండపల్లి నిప్పులు చెరిగారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని జగన్‌ను వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నించరని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు వస్తున్నాయని అన్నారు.


గతంలో విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ పని చేశారని గుర్తు చేశారు. ఆయన ఆ స్థాయికి తగినట్లు మాట్లాడాలని సూచించారు. తక్షణమే మీ కామెంట్లు వెనక్కి తీసుకోవాలని బొత్సను మంత్రి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వోక్స్‌వ్యాగన్ లావాదేవీలతో బొత్స రాష్ట్రానికి పెద్ద మచ్చ తెచ్చారని.. దీంతో ఆ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ మహారాష్ట్రకు వెళ్లిందని వ్యాఖ్యానించారు. జిల్లాలో 583 మందికి గ‌త డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు వ‌చ్చాయని.. ప‌రీక్ష ఎంత పారదర్శకంగా జ‌రిగిందో వాళ్లని అడిగితే చెబుతారని బొత్సకు చురకలంటించారు. మంగళవారం జరిగే మీ ధర్నాను ప్రజలు చీ కొడతారన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ పరీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్నకు ఏం చెబుతారని బొత్సను మంత్రి శ్రీనివాస్ నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

చనిపోవడానికి ఉన్న ధైర్యం బతకడానికి ఎందుకు చూపించరు: మంత్రి సంధ్యారాణి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2026 | 06:21 PM