ఏపీ అభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు అవసరం: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jul 03 , 2026 | 01:26 PM
ఏపీలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కీలక అడుగు పడింది. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్ములమడుగు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా భూమిపూజ చేశారు.
విజయనగరం, జులై 3: ఏపీలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కీలక అడుగు పడింది. ఈరోజు(శుక్రవారం) జిల్లాలోని శృంగవరపుకోట మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి కడప జిల్లా జమ్ములమడుగు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నారు. రైతులకు భూమికి ఉన్న సంబంధం - తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం లాంటిదని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మొదటి దశలో 535 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు వస్తుందని చెప్పారు.
వివిధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా సుమారు 45 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రి వెల్లడించారు. ఎస్.కోట నియోజకవర్గం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందనుందని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో ఎర్ర బస్సు రానిచోట, ఎయిర్‌పోర్టు ఎలా వస్తుందని జగన్ అన్నారని.. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర నుంచి గతంలో వలసలు వెళ్లేవారని.. ఇప్పుడు ఉత్తరాంధ్రకే వివిధ ప్రాంతాలవారు వలసలు వచ్చే పరిస్థితి ఉందని అనిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లలిత కుమారి, ఎమ్మెల్సీలు రఘురాజు, శ్రీనివాస్ నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, అధికారులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి...
సాయికృష్ణ కేసు.. కోర్టుకు కీలక విషయాలు తెలిపిన సిట్
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ సంస్థలకు గ్రీన్ సిగ్నల్
Read Latest AP News And Telugu News