Share News

సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులు ఎదగాలి: వెంకయ్యనాయుడు

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:27 PM

పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత విద్యాలయాలపై ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా విద్యార్థులు ఎదగాలని సూచించారు.

సమాజానికి ఉపయోగపడేలా విద్యార్థులు ఎదగాలి: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu

విశాఖపట్నం, ఫిబ్రవరి 7: పెందుర్తిలోని బాలాజీ హై ఫీల్డ్స్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Former Vice President Venkaiah Naidu) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో పిల్లలకు విద్యతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పించాలని అన్నారు. పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత విద్యాలయాలపై ఉందన్నారు. చదువు అంటే కేవలం ఉద్యోగం సంపాదించడమే కాదని, సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా విద్యార్థులు ఎదగాలని సూచించారు. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం మాత్రమే కాదని, ప్రకృతిని కాపాడుకునే బాధ్యత కూడా అందరిపై ఉందన్నారు.


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. భారతదేశమని అన్నారు వెంకయ్యనాయుడు. ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు విర్రవీగుతూ బూతులు తిడుతున్నారని విమర్శించారు. అలాంటి వారికి ప్రజలు పోలింగ్ బూత్‌లోనే తగిన సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ నాయకులకు బూతులు మాట్లాడటం ఒక ఫ్యాషన్‌లా మారిపోయిందని మండిపడ్డారు. ఎంత ఎక్కువ బూతులు మాట్లాడితే అంత పబ్లిసిటీ వస్తుందని కొందరు భావిస్తున్నారని విమర్శించారు. రాజకీయ నాయకులు అందరికీ ఆదర్శంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి సూచించారు.


ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు కంచికల రమేశ్ బాబు, విశాఖపట్నం మేయర్ పీల శ్రీనివాస్‌లతో పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్కూల్ పిల్లలతో కొంతసేపు సరదాగా మాట్లాడిన మాజీ ఉపరాష్ట్రపతి.. ఆ తర్వాత స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు.


ఇవి కూడా చదవండి...

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో గురుకుల విద్యార్థి ఆత్మహత్య

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 07 , 2026 | 04:45 PM