అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ: నితిన్ నబిన్ ఫైర్
ABN , Publish Date - Aug 18 , 2026 | 03:14 PM
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మండిపడ్డారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
విశాఖపట్నం, ఆగస్టు18: కార్యకర్త నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పోరాటాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. మంగళవారం విశాఖపట్నంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉందని అన్నారు. దేశాన్ని మరింత శక్తిమంతంగా చేయడానికి సంకల్పం తీసుకోవాలని ప్రతి కార్యకర్తకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో మంచి పాలన అందుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూటమికి మంచి విజయాన్ని అందించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి కూటమి ఏర్పాటైందని వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని అన్నారు.
అంధ్రప్రదేశ్‌పై ప్రధాన మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తు చేశారు. తమ కలలను సాకారం చేసే పార్టీని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. అనేక ప్రాజెక్టులు ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి డబల్ ఇంజిన్ సర్కార్ పని చేస్తుందని అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విపక్షం కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. దీనిని తిప్పి కొట్టాలని బీజేపీ శ్రేణులకు సూచించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు నేషనల్ బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో నిరాశ కనపడుతోందని వ్యాఖ్యానించారు. విపక్షం వాడే భాష.. దేశాన్ని అస్థిర పరిచేలా ఉందన్నారు. దేశం ముందుకెళ్తుంటే సహించలేక పోతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల వైఖరిని ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.
ప్రస్తుత రాజకీయాల్లో విపక్షాలు, పార్ట్ టైం నాయకుల్లా తయారయ్యారని వ్యంగ్యంగా అన్నారు. యువతను ప్రభుత్వం మీద రాళ్లు విసిరేందుకు వాడితే.. మనం దేశ నిర్మాణానికి వాడుతున్నామని చెప్పారు. దేశంలోని యువతతో మమైకం కావాలని ఈ సందర్భంగా పార్టీ కేడర్‌కు సూచించారు. బీజేపీ జాతీయ వాదంతో ముందుకెళ్లాల్సి ఉందన్నారు. అన్ని వర్గాల వద్దకు వెళ్లి పార్టీని ముందుకు తీసుకెళ్లి.. బలోపేతం చేయ్యాలని పార్టీ శ్రేణులను ఆయన దిశానిర్దేశం చేశారు.
వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రాప్రదేశ్ దిశగా పనిచేయాలని శ్రేణులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీలో ఈ ఏడాదిలో జరిగిన అభివృద్ధిపై పుస్తకాన్ని జాతీయ బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ ఆవిష్కరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ కమిటీలో పదవులు పొందిన దగ్గుబాటి పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డిని ఈ సందర్భంగా నితిన్ నబిన్ సన్మానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ... స్థానిక ఎన్నికల తర్వాతే: సీఎం చంద్రబాబు
విశాఖపట్నంలో రెండు మృతదేహాల కలకలం..
Read Latest AP News And Telugu News