వైసీపీ నేతల మాటలే వారికి సమాధి రాళ్లు: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Jun 17 , 2026 | 07:12 PM
వైసీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నంలో బియ్యం దొంగ పేర్ని నానికి వయస్సు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదన్నారు.
విశాఖపట్నం, జూన్ 17: వైసీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నంలో బియ్యం దొంగ పేర్ని నానికి వయస్సు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదన్నారు. తమ నాయకుడు, మంత్రి లోకేశ్ వ్యాఖ్యలను పేర్ని నాని వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీని విమర్శించినట్లు దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ కుమార్తె భువనమ్మ, టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో మహిళల రక్షణ, శాంతి భద్రతల కోసం కష్టపడుతున్న హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత వ్యాఖ్యలు చేయడం దారుణమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గౌతు లచ్చన్న మనవరాలు ఎమ్మెల్యే గౌతు శిరీషపై చేసిన వ్యాఖ్యలు మరచి పోతామా? అన్నారు. రాజధాని అమరావతి కోసం పోరాటం చేసిన మహిళలను ఎంతో కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తన సొంత తోబుట్టువుపై నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు.
సొంత బాబాయినీ గొడ్డలి పోటు వేసి.. ఆయన కుమార్తె వైఎస్ సునీతపై నీచంగా మాట్లాడారని తెలిపారు. ఇదేనా మహిళలపై మీకున్న గౌరవం అని వైసీపీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. వీటిని రాష్ట్ర ప్రజలు మర్చిపోరన్నారు. వైసీపీ నేతల మాటలే వారికి సమాధి రాళ్లు అని అభివర్ణించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వైఖరి నీచంగా ఉంటుందంటూ మంత్రి కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్‌కి మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు.
బీచ్ సాక్స్ పాలసీ ఒక్క మన రాష్ట్రంలోనే లేదన్నారు. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా దీనిని తీసుకొస్తున్నామని వివరించారు. దీనిని విశాఖపట్నం, బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకొస్తున్నామన్నారు. ఆల్కహాల్ మోతాదు తక్కువ ఉండే మద్యం ఇక్కడ ఉంటుందని వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలతో చర్చించి.. వీటిని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు: విపత్తు నిర్వహణ సంస్థ
ఇందిరమ్మ ఇళ్లు రెండో విడతలో వారికే తొలి ప్రాధాన్యం: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telugu News