Share News

జీవీఎంసీ నిధులు అమరావతికి మళ్లించలేదు.. ప్రచారం పూర్తిగా అవాస్తవం: కమిషనర్

ABN , Publish Date - Oct 05 , 2026 | 09:06 AM

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ నిధులను అమరావతికి మళ్లించారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. నిధుల లభ్యతకు అనుగుణంగా కాంట్రాక్టర్ల బిల్లులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

జీవీఎంసీ నిధులు అమరావతికి మళ్లించలేదు.. ప్రచారం పూర్తిగా అవాస్తవం: కమిషనర్
GVMC Funds

మహా విశాఖ నగర పాలక సంస్థ (GVMC) సాధారణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం.. అమరావతికి మళ్లిస్తోందంటూ సోషల్ మీడియా, కొన్ని వేదికలపై జరుగుతున్న ప్రచారంపై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ (Ketan Garg IAS) స్పందించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు. జీవీఎంసీ ఆర్థిక రికార్డులకు పొంతన లేకుండా, వాస్తవాలను పక్కనబెట్టి నిధుల మళ్లింపుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.


గణాంకాలతో జీవీఎంసీ వివరణ

కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లుల రికార్డులను కమిషనర్ ఈ సందర్భంగా విడుదల చేశారు.

2019-20 నుంచి 2026-27 వరకు: జీవీఎంసీ సాధారణ నిధుల నుంచి మొత్తం 24,128 బిల్లులకు గాను రూ.2,620.28 కోట్ల చెల్లింపులు జరిగాయి.

గత రెండేళ్లలో (2025-26 నుంచి 2026-27): కేవలం ఈ రెండేళ్ల వ్యవధిలోనే 6,057 బిల్లులకు గాను రూ.940.17 కోట్ల భారీ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది.

ఇటీవలి చెల్లింపులు: 2025 నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన బిల్లుల కింద 07-09-2026న రూ.95 కోట్లను జీవీఎంసీ విడుదల చేసింది.


విశాఖపట్నం నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కాంట్రాక్టర్ల పాత్ర అత్యంత కీలకమైనదని కమిషనర్ కేతన్ గార్గ్ కొనియాడారు. సంస్థలో నిధుల లభ్యతను ఆధారంగా వరుస క్రమంలో ప్రాధాన్యతా ప్రాతిపదికన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని చెప్పారు. ఆధారాలు లేని ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మి గందరగోళానికి గురికావద్దని ఆయన స్పష్టం చేశారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా, రికార్డులకు విరుద్ధంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యుద్ధ విరమణ కోసం భారత్‌ చేసిన ప్రతిపాదనలు బాగున్నాయి

రష్యా డ్రోన్‌ దాడి.. ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌ ధ్వంసం

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 05 , 2026 | 09:22 AM