పేదలకు పట్టాభిషేకం.. 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
ABN , Publish Date - Sep 19 , 2026 | 03:39 PM
విశాఖలో ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28,445 పేద కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను పంపిణీ చేశారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను సీఎం పంపిణీ చేశారు. మొత్తం రూ.8,874 కోట్ల విలువైన భూమికి సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందించారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించింది. దశాబ్దాలుగా ఇళ్లపై ఉన్న అనిశ్చితికి ఈ పట్టాలతో ముగింపు పలుకుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఇకపై లబ్ధిదారులు తమ ఇళ్లపై పూర్తి హక్కులు కలిగి ఉంటారని చెప్పారు.
‘ఇక మీ ఇళ్లపై ఎలాంటి భయం లేదు’
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సొంతిల్లు ఉండాలనేది ప్రతి మనిషి కల అని అన్నారు. పేదలకు సొంత ఇళ్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. 'మీరు ఉంటున్న ఇళ్లపై సర్వహక్కులు ఇక నుంచి మీవే. మీ ఇళ్లపై ఎలాంటి వివాదం లేదు.. భయం లేదు' అని చంద్రబాబు అన్నారు. పట్టాలు పొందిన తర్వాత అవసరమైతే ఇళ్లపై బ్యాంకు రుణాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇళ్ల హక్కు పత్రాలు అందుకోవడం ద్వారా పేద కుటుంబాలకు ఆస్తిపై భద్రత ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. పోలవరం ఎడమ కాలువను పూర్తి చేసి అనకాపల్లికి నీటిని అందించడంతో పాటు విశాఖకు గోదావరి జలాలను తీసుకొస్తామని చెప్పారు. ఉత్తరాంధ్రలో గత రెండేళ్లలో 91 ప్రాజెక్టులు వచ్చాయని, ఈ ప్రాంతానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించామని చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తంగా రూ.5.37 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. విశాఖ నగరం త్వరలో విశ్వనగరంగా ఎదగనుందని సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు గేమ్‌చేంజర్‌గా మారనుందని తెలిపారు. విశాఖలో నీటి సమస్య లేకుండా వచ్చే ఏడాదిలోగా పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో నీటి కొరత రాకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తిరుపతిలో 89.41 శాతం పచ్చదనం ఉందని, విశాఖను కూడా అదే స్థాయికి తీసుకెళ్లాలనేది తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, అనేక భూ కుంభకోణాలు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. వాటన్నింటినీ అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో శాంతి లేకుండా చేశారని విమర్శించారు. రుషికొండలో నిర్మించిన భవనాలను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. ఎన్ని డేటా సెంటర్లు వచ్చినా విశాఖకు నీటి ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని, పేదలకు ఇస్తున్న పట్టాలు వారి పిల్లల భవిష్యత్తుకు పట్టాభిషేకం వంటివని అన్నారు. అప్పుల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తెచ్చామని, రైల్వే జోన్ రావడంతో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
వైసీపీ పాలన ఒక పీడకల: చంద్రబాబు
వైసీపీ పాలన రాష్ట్రానికి ఒక పీడకలని సీఎం చంద్రబాబు విమర్శించారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలకు పాల్పడ్డారని, చివరకు శ్రీవారి లడ్డూను కూడా కల్తీ చేశారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ కుట్రలు ఆగలేదని, మెగా DSCపై అనేక కేసులు వేశారని అన్నారు. కోర్టులు చివాట్లు పెట్టడంతో ఇప్పుడు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విశాఖకు కంపెనీలు రాకుండా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. దేవాలయ భూములకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులను తొలగిస్తామని తెలిపారు. గత రెండేళ్లలో 5.50 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చామని, వచ్చే మార్చిలో మరో 5.52 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read:
కేరళ రాజకీయాల్లో ఈడీ కలకలం.. మాజీ సీఎం పినరయికి బిగ్ షాక్?
‘నాలాపై జన్వాడ ఫాంహౌస్ నిర్మాణం’.. కాంగ్రెస్ ఎంపీల సంచలన కామెంట్స్