Share News

ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై వేటు

ABN , Publish Date - Aug 01 , 2026 | 08:56 AM

గత ప్రభుత్వంలో నిబంధనల ఉల్లంఘన, భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై వేటు
AU former VC Prasad Reddy

  • మరో ముగ్గురు ప్రొఫెసర్లూ సస్పెన్షన్‌

  • ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ కూడా

  • విజిలెన్స్‌ నివేదిక ప్రకారం చర్యలు

  • గత ప్రభుత్వంలో భారీగా అక్రమాలు

  • పదవీ విరమణకు కొద్ది గంటల ముందు

  • ప్రసాదరెడ్డికి సస్పెన్షన్‌ ఉత్తర్వులు

విశాఖపట్నం, జూలై 31(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో నిబంధనల ఉల్లంఘన, భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. విజిలెన్స్‌ నివేదిక సిఫారసుల మేరకు ఆయనతో పాటు మరో ముగ్గురు ప్రొఫెసర్లు, ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ను కూడా సస్పెండ్‌ చేశారు. వారిలో ఆర్‌అండ్‌డీ డీన్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ బసవయ్య (ప్రస్తుతం కెమిస్ర్టీ విభాగం ప్రొఫెసర్‌), కంప్యూటర్‌ సైన్స్‌ ఐటీ విభాగాధిపతిగా పనిచేసిన ప్రొఫెసర్‌ కుంజం నాగేశ్వరరావు (ప్రస్తుతం ఐటీ విభాగంలో ప్రొఫెసర్‌), అంబేడ్కర్‌ చైర్‌ ప్రొఫెసర్‌ జేమ్స్‌ మేకా స్టీఫెన్‌ (రిజిస్ర్టార్‌గా కూడా పనిచేశారు), ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆఫీ్‌సలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణ అప్పారావు ఉన్నారు.


ఏయూ అధికారులు సదరు ఉద్యోగులకు ఈ మేరకు సస్పెన్షన్‌ ఉత్తర్వులను పంపించారు. ప్రొఫెసర్‌ ప్రసాదరెడ్డి శుక్రవారం సాయంత్రం పదవీ విరమణ చేయాల్సి ఉండగా, కొద్ది గంటల ముందు సస్పెన్షన్‌ ఉత్తర్వులను జారీ చేశారు. అంతకుముందు కొత్తగా ఏర్పాటైన ఏయూ పాలకవర్గం సమావేశమైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై సస్పెన్షన్‌కు సంబంధించిన ఆమోదాన్ని ఈ సమావేశంలోనే తీసుకున్నట్టు తెలిసింది. అనంతరం ఏయూ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. 2019-2024 మధ్య కాలంలో వారు అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏయూ వీసీగా ప్రసాదరెడ్డి పనిచేశారు. అప్పట్లో ఎన్నో అవకతవకలకు పాల్పడినట్టు విజిలెన్స్‌ బృందం ఆధారాలతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆయనతో పాటు సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.

Updated Date - Aug 01 , 2026 | 08:56 AM