ముగ్గురు యువతుల ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:46 PM
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ మల్లంగుమి గ్రామ సమీపంలో ఉన్న జలపాతంలో సెల్ఫీలు దిగుతూ నలుగురు యువతులు అందులో పడిపోయారు. వారిలో ముగ్గురు మృతి చెందారు.
అల్లూరి జిల్లా, ఏప్రిల్ 9: సెల్ఫీ పిచ్చి పలువురిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. సరదాగా ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవాలని యువత పడుతున్న ఆరాటం వారి ప్రాణాల మీదకు తెస్తోంది. సెల్ఫీ మాయలో పడి తమ వైపు పొంచి ఉన్న ముప్పును తెలుసుకోలేక అనేక మంది యువత ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో. తాజాగా అల్లూరి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలను బలిగొంది.
అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ మల్లంగుమి గ్రామ సమీపంలో ఉన్న జలపాతం వద్ద నలుగురు యువతులు సరదాగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంతలోనే ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయారు. వారిలో ముగ్గురు అమ్మాయిలు మృతి చెందగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురమ్మాయిలు జలపాతం సమీపంలో నిలిచి ఉండగా.. మరొక అమ్మాయి సెల్ఫీ తీస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నలుగురు అమ్మాయిలను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ముగ్గురు యువతులు మరణించారు. ఓ యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు బూర్జ పంచాయతీ జంబు వలస గ్రామానికి చెందిన త్రిష, పవిత్ర, రత్నకుమారిగా గుర్తించారు. అంజలి అనే మరో యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యువతుల మృతితో జంబు వలస గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
తప్పు చేసిన వారి విషయంలో చట్ట ప్రకారమే చర్యలు: హోం మంత్రి అనిత
ఏబీఎన్ ఎండీపై జగన్ వ్యాఖ్యలు.. మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్
Read Latest AP News And Telugu News