రాజకీయ నేతల ప్రవర్తన, పనితీరు యువతకు ఆదర్శంగా ఉండాలి: అయ్యన్నపాత్రుడు
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:55 PM
చట్టసభల్లో రభస చేయడానికి మాత్రమే పరిమితమై.. సభకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకునే ఎమ్మెల్యేలు ఉన్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శించారు. వీళ్లు కళ్లేదురుగా కనిపిస్తుంటే యువతరానికి రాజకీయాలు అంటే గౌరవం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు.
అమరావతి, ఏప్రిల్ 9: ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్న రాజకీయాలను యువత ఏవగించుకుంటున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు(AP Assembly Speaker Ayanna Patrudu) తెలిపారు. గోవాలో పశ్చిమ ప్రాంత కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో స్పీకర్ పాల్గొని ప్రసంగించారు. చట్టసభల్లో రభస చేయడానికి మాత్రమే పరిమితమై.. సభకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకునే ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. వీళ్లు కళ్లేదురుగా కనిపిస్తుంటే యువతరానికి రాజకీయాలు అంటే గౌరవం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. ఈ ధోరణి మారాలంటే రాజకీయ నాయకుల నడవడిక మారాలని సూచించారు. చట్టసభల్లో వారి ప్రవర్తన, పనితీరు ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు. విద్యార్ధి దశలో రాజకీయాలకు దాదాపు తెరపడిందని స్పీకర్ తెలిపారు.
రాజకీయ ప్రయోగశాలగా ఉండే విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్ధులు రాజకీయాల్లో ప్రవేశించడం దాదాపు శూన్యం అయిందన్నారు స్పీకర్. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి ఎందరో నవతరానికి, వారసత్వం లేని వారికి రాజకీయ అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు తొమ్మిదిసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ అమలులోకి వచ్చిన తరువాత చట్టసభల్లో 33 శాతం సీట్లు 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికోసం రిజర్వ్ చేయాలని సూచించిన స్పీకర్.. అప్పుడే కొత్త నీరు వస్తుందని అభిప్రాయపడ్డారు. భిన్నంగా ఆలోచించకపోతే యువతను రాజకీయాలవైపు ఆకర్షించడం, వారికి అవకాశాలు కల్పించడం సాధ్యం కాదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
గోవా గవర్నర్‌తో స్పీకర్ భేటీ
గోవాలో జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) వెస్ట్ జోన్ సదస్సుకు హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు... గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్ భవన్‌లో జరిగిన ఈ భేటీలో మాజీ సీఎం ఎన్టీఆర్ రాజకీయ జీవిత చరిత్ర ఆధారంగా రమేష్ కందుల రచించిన ‘మేవరిక్ మెస్సయ్య’ (Maverick Messiah) పుస్తకాన్ని గవర్నర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహూకరించారు.
ఇవి కూడా చదవండి...
తప్పు చేసిన వారి విషయంలో చట్ట ప్రకారమే చర్యలు: హోం మంత్రి అనిత
ఏబీఎన్ ఎండీపై జగన్ వ్యాఖ్యలు.. మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్
Read Latest AP News And Telugu News