Share News

కరువు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర

ABN , Publish Date - Sep 01 , 2026 | 04:10 AM

‘శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయల్దేరిన కృష్ణమ్మ.. చెన్నకేశవుడు కొలువై ఉన్న మార్కాపురం నేలకు హారతి ఇస్తోంది. కరువు నేలకు కృష్ణమ్మను తెచ్చాం. ఇదీ మా నిబద్ధత’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

కరువు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర

  • ఫీడర్‌ కెనాల్‌ వద్ద కృష్ణమ్మకు శాస్త్రోక్తంగా జలహారతి

  • కొండలు తొలిచి నీటిని తీసుకొచ్చాం

  • కరువుతో పోరాడిన ఫ్లోరైడ్‌ బాధితుల మార్కాపురం గడ్డకు ఇక విముక్తి

  • 3 దశాబ్దాల క్రితం శంకుస్థాపన చేశా

  • ఇప్పుడు నేనే ప్రారంభోత్సవం చేశా

  • 2019లో గొడ్డలి పార్టీ రాకతో గ్రహణం

  • వెలిగొండను పూర్తిగా గాలికొదిలేశారు

  • 4 వేల కోట్ల పనులు పెండింగ్‌లో పెట్టారు

  • ఎన్నికల ముందు ప్రారంభమంటూ డ్రామాలు

  • కూటమి రాకతో ఆ గ్రహణం వీడింది

  • నల్లమల సాగర్‌కు గోదారినీ తెస్తాం: సీఎం

  • జలవనరుల మంత్రి నిమ్మలపై పొగడ్తలు

  • పూల సుబ్బయ్య కుమార్తెలకు సత్కారం

  • వెలిగొండ.. బంగారుకొండ: సీఎం.. ప్రాజెక్టు తొలి దశ జాతికి అంకితం

ఓట్లు ఆశించి కాదు.. మార్పు ఆశించి పనిచేస్తున్నాను. ఎన్నికల కోసం కాదు.. ప్రజల జీవితాలను మార్చేందుకు, భావి తరాల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాను. ఇదే కూటమి సిద్ధాంతం కూడా.

2019లో గొడ్డలి పార్టీ రాకతో వెలిగొండకు గ్రహణం పట్టింది. తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక అది వీడిపోయింది. ప్రాజెక్టును ప్రారంభించుకున్నాం.

- సీఎం చంద్రబాబు

ఒంగోలు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ‘శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయల్దేరిన కృష్ణమ్మ.. చెన్నకేశవుడు కొలువై ఉన్న మార్కాపురం నేలకు హారతి ఇస్తోంది. కరువు నేలకు కృష్ణమ్మను తెచ్చాం. ఇదీ మా నిబద్ధత’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తరాలుగా నష్టపోయిన ఈ ప్రాంతాన్ని ఆదుకునే అవకాశాన్ని భగవంతుడు తనకిచ్చాడని ఒకింత భావోద్వేగంతో అన్నారు. వెలిగొండ.. బంగారుకొండ అని.. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. కృష్ణమ్మ నీటినే కాక నల్లమల సాగర్‌ (వెలిగొండ రిజర్వాయర్‌)కు గోదావరి జలాలను కూడా తెస్తామని ప్రకటించారు.


ఉమ్మడి ప్రకాశం జిల్లా.. ప్రత్యేకించి ప్రస్తుత మార్కాపురం జిల్లాతోపాటు నెల్లూరు, కడప జిల్లాల పరిధిలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను దోర్నాల మండలం గంటావానిపల్లి వద్ద ముఖ్యమంత్రి సోమవారం జాతికి అంకితం చేశారు. సొరంగ మార్గాల ద్వారా బిరబిరా వచ్చిన కృష్ణమ్మకు ఫీడర్‌ కాలువలో శాస్త్రోక్తంగా జలహారతి ఇచ్చారు. కాలువ నీటిలో దిగి పసుపు, కుంకుమ, చీర సమర్పించి.. పూలుజల్లి హారతి పట్టారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. వెలిగొండకు మూడు దశాబ్దాల క్రితం తాను శంకుస్థాపన చేస్తే.. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం రూ.10,200 కోట్లకు చేరిందన్నారు. ఇప్పటి వరకు రూ.7,983 కోట్లు ఖర్చుకాగా.. అందులో 50 శాతం టీడీపీ ప్రభుత్వ కాలంలోనే చేశామన్నారు. నిర్మాణంలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయని.. కొండలు అడ్డు వస్తే తొలుస్తూ.. సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగామని చెప్పారు. ‘చంద్రబాబు అనే నేను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక మార్కాపురం ప్రాంతానికి వస్తే వెలిగొండ గురించి కరువు బారిన పడిన ప్రజలు చెప్పారు. నీరు ఎక్కడి నుంచి తీసుకురాగలమని అడిగితే కృష్ణా నీటిని ఐదేళ్లకోసారి ఇచ్చినా కనీసం తాగడానికి అయినా ఉపకరిస్తాయన్నారు. ఇక్కడి పరిస్థితిని చూసి చలించిపోయి.. మూడు దశాబ్దాల క్రితం 1996 మార్చి 5న వెలిగొండకు నేనే శంకుస్థాపన చేశా. మళ్లీ 30 ఏళ్ల తర్వాత నేనే తొలి దశను ఆరంభించా’ అని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..


వైసీపీది ఫేక్‌ డ్రామా, సినిమా సెట్టింగ్‌లు

గత వైసీపీ పాలనలో విలువైన పనులను గాలికొదిలేసి నిర్వాసితుల కోసం జీవో ఇచ్చి అరకొర చెల్లింపులతో మోసం చేశారు. ఎన్నికలకు నెల ముందు ప్రాజెక్టును పూర్తిచేశామని.. జాతికి అంకితం చేస్తున్నట్లు డ్రామాలాడారు. నీరివ్వకుండా.. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా.. ఇంకా రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్‌లో ఉంచుకొని ఫేక్‌ డ్రామాలు, సినిమా సెట్టింగులతో రైతులను, ప్రజలను మోసం చేసిన వ్యక్తులను ఏమనాలి? ఫేక్‌ మాటలతో మోసం చేసిన వారిని నిలదీయాలి. వారి హయాంలో సొరంగంలో టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం) ఇరుక్కుపోయి పనులు కూడా పూర్తికాలేదు. అలాంటి వాటిని పూర్తిచేసి ఇప్పుడు నీళ్లు ఇచ్చాం. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితుల త్యాగం గొప్పది. భూములు, ఇళ్లు, ఊర్లు త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా. వారి త్యాగం లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. నిర్వాసితులకు రూ.910 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉండగా 48 రోజుల్లో 6,206 కుటుంబాలకు రూ.768 కోట్లు అందజేశాం. వారి ఆర్థిక కష్టాలు, అవసరాలు గుర్తించి కటాఫ్‌ డేట్‌ను పెంచి మరో రూ.169 కోట్లు అదనపు సాయం చేస్తున్నాం.

నిమ్మల మంచి టీమ్‌లీడర్‌

వెలిగొండ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడి కృషి భేష్‌. ఆయన మంచి టీమ్‌ లీడర్‌. ఆయన కృషితో ప్రాజెక్టును అనుకున్న సమయానికి ప్రారంభించగలిగాం.


..చూస్తామని అనుకోలేదు: పూల సుబ్బయ్య కుమార్తెలు

వెలిగొండ ప్రాజెక్టు కోసం పోరాటాన్ని ప్రారంభించిన సీపీఐ మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్‌ పూల సుబ్బయ్య కుటుంబసభ్యులను ప్రత్యేకంగా సభకు ఆహ్వానించారు. ఆయన కుమార్తెలు విలాసిని, సునందినిలను సీఎం సత్కరించారు. వెలిగొండను పూర్తిచేస్తారని, దానిని చూస్తామని తాము ఎప్పుడు అనుకోలేదని, అలాంటిది చేసి చూపించారంటూ వారు చంద్రబాబు కాళ్లకు నమస్కరించారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల, కందుల దుర్గేశ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌, పొంగూరు నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


2028కి రెండో దశ పూర్తిచేస్తాం

వెలిగొండ తొలిదశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4లక్షల మందికి తాగునీరు ఇస్తాం. మరో రూ.190 కోట్లు ఖర్చుచేసి రెండో దశను 2028 నాటికి పూర్తిచేసి 4 జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23లక్షల మందికి తాగునీరు ఇస్తాం. ఈ ప్రాజెక్టుతో కరువుతో నిత్యం పోరాడుతూ అలసిపోయి ఫ్లోరైడ్‌ బారిన పడిన పశ్చిమ ప్రకాశం ప్రజలకు, మార్కాపురం గడ్డకు విముక్తి లభిస్తుంది. 11ఏళ్లు అధికారంలో ఉన్న వైఎస్‌, జగన్‌ పూర్తిచేయలేకపోయిన ప్రాజెక్టును నేను పూర్తిచేశాను. ఫేక్‌ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడదాం. చెడును ఖండించి మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఉత్తరాంధ్రలో భోగాపురం వెలుగులు, రాయలసీమలో పారిశ్రామిక ప్రగతి, కరువు ప్రాంతంలోకి కృష్ణమ్మను పరుగులు పెట్టించాం. సీమ హార్టీకల్చర్‌ హబ్‌లో మార్కాపురాన్నీ భాగం చేశాం. జిల్లా ఏర్పాటు, వెలిగొండ నిర్మాణం, హార్టీకల్చర్‌ హబ్‌లో చేరికతో ఈ జిల్లా ఇక అన్‌స్టాపబుల్‌. దక్షిణ భారతంలో గోదావరి-కావేరి అనుసంధానం కావాలి.. ఉత్తర భారతంలో గంగా-మహానది అనుసంధానంతో దేశం సుభిక్షమవుతుంది. వీటిపై ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయమండలి సమావేశంలో కూడా చర్చించాం.


ఇవి కూడా చదవండి

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..

పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 01 , 2026 | 04:42 AM