ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరబోతోంది
ABN , Publish Date - Sep 02 , 2026 | 03:11 AM
పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాల రాకతో ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరబోతోందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
క్లిష్టమైన పనులు రెండేళ్లలో పూర్తిచేశాం
2500 కోట్లతో కొత్తగా 11 ప్రాజెక్టులు: నిమ్మల
పాయకరావుపేట/అమరావతి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాల రాకతో ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరబోతోందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని తాండవ షుగర్స్ వెనుక పోలవరం ఎడమ కాలువలోకి బుధవారం రానున్న గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించనున్న జలహారతి కార్యక్రమం ఏర్పాట్లను హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తెచ్చేందుకు సీఎం చంద్రబాబు అపర భగీరథుడిలా కృషిచేశారని తెలిపారు. గడచిన రెండేళ్లలో ఎడమ కాలువ నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన పనులను పూర్తిచేశామన్నారు. ముఖ్యంగా ఏలేరు, పంపా, తాండవ, వరహా, శారదా నదులతోపాటు 11 చోట్ల జాతీయ రహదారిని క్రాస్ చేసి భారీ నిర్మాణాలు చేపట్టామన్నారు. ఎన్నో అవాంతరాలను అధిగమించి మొదటి దశ పూర్తిచేశామని, ఎడమ కాలువ ఉత్తరాంధ్ర అభివృద్ధికి జీవనాడిగా మారనుందని తెలిపారు. విజనరీ నేత చంద్రబాబు వచ్చే రెండేళ్లలో ఉత్తరాంధ్రలో రూ.2,500 కోట్లతో 11 ప్రాధాన్య ప్రాజెక్టులు చేపట్టేందుకు నిర్ణయించారని చెప్పారు. నేరడి బ్యారేజీ పనులు పట్టాలెక్కిస్తాన్నారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని